ఉక్రెయిన్‌పై దాడిచేశారో.. జాగ్రత్త: పుతిన్‌ను హెచ్చరించిన బైడెన్

  • ఉక్రెయిన్‌ సరిహద్దులో సేనలు మోహరించిన రష్యా
  • పెరిగిన ఉద్రిక్తతలు
  • ఏ క్షణాన అయినా 8,500 దళాలను పంపుతామన్న పెంటగాన్
  • అదేమీ లేదన్న బైడెన్
  • భయంకరమైన ఆర్థిక ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని బైడెన్ హెచ్చరిక
అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌పై కనుక రష్యా దాడిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పుతిన్‌పై వ్యక్తిగత ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో రష్యా తన సేనలను మోహరించడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఉక్రెయిన్ విషయంలో ఏదో జరగబోతోందని ఊహించిన అమెరికా రక్షణ శాఖ పెంటగాన్.. ఏ క్షణాన అయినా 8,500 దళాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.

ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే, నిన్న విలేకరులతో మాట్లాడిన బైడెన్ మాత్రం ఉక్రెయిన్ రక్షణ కోసం అమెరికా సైన్యాన్ని పంపే ప్రతిపాదన ఏమీ లేదన్నారు. నాటో దేశాల్లోని తూర్పు సరిహద్దుల రక్షణ కోసం మాత్రం అదనపు బలగాలను పంపాల్సి ఉందన్నారు.

ఈ విషయాన్ని పుతిన్‌కు తాను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని, ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడి చేస్తే కనుక ఆ తర్వాత భయంకరమైన ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క, ఉక్రెయిన్‌పై దాడికి దిగబోతున్నారన్న వార్తలపై స్పందించిన రష్యా అలాంటిదేమీ లేదని కొట్టిపడేసింది. నాటో, అమెరికా చర్యలే సంక్షోభానికి కారణమని ఆరోపించింది.


More Telugu News