మంచి ముహూర్తం మించిపోకుండా... మంచు వానలో తరలివెళ్లిన పెళ్లికొడుకు... వీడియో ఇదిగో!

  • హిమాచల్ ప్రదేశ్ లో ఘటన
  • ఈ నెల 23న జరిగిన పెళ్లి
  • ముహూర్తం వేళకు భారీగా మంచు
  • 6 కిమీ మంచులోనే ఊరేగింపుగా వెళ్లిన వరుడు
పెళ్లి... ప్రతి ఒక్కరి జీవితంలో ఓ కీలకఘట్టం. వివాహ ఘడియలను యువతీయువకులు అత్యంత మధురమైనవిగా భావిస్తారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వినీత్ ఠాకూర్ జీవితంలోనూ పెళ్లి ఘడియలు వచ్చాయి. వినీత్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లా బిద్రోహ్ నాలా ప్రాంతానికి చెందినవాడు. అతడికి దందోరీ ప్రాంతానికి నిషా అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. జనవరి 23న రాత్రి 10 గంటలకు ముహూర్తం నిర్ణయించారు.

అయితే, ఉత్తరాదిన జనవరి మాసంలో తీవ్రంగా మంచు కురుస్తుంటుంది. హిమాచల్ ప్రదేశ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో పెళ్లి వేదికను చేరుకునేందుకు వరుడు వినీత్ ఠాకూర్, అతడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బయల్దేరారు. ఇంతలో భారీగా మంచు కురవడం ప్రారంభమైంది.

ఓవైపు ముహూర్తం దగ్గరపడుతుండడంతో పెళ్లిబృందం ఎక్కడా తగ్గలేదు. మంచులో కాళ్లు కూరుకుపోతున్నప్పటికీ వరుడ్ని పల్లకీలో మోసుకుంటూ ఆరు కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అమ్మాయి, అబ్బాయి జాతకం ప్రకారం ఆ ముహూర్తం దివ్యంగా ఉందని పురోహితుడు చెప్పడంతో అనుకున్న సమయానికే పెళ్లి జరిపించామని వరుడి తరఫు బంధువులు వెల్లడించారు.


More Telugu News