టీమిండియాకు ఈ దశ తాత్కాలికమే: రవిశాస్త్రి

  • దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియాకు పరాజయాలు
  • టెస్టు, వన్డే సిరీస్ లు కోల్పోయిన భారత్
  • ఈ పరిస్థితిని భారత్ అధిగమిస్తుందన్న శాస్త్రి
  • కోహ్లీ ఘనతలను తక్కువ చేసి చూడలేమని వ్యాఖ్యలు
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా టెస్టు, వన్డే సిరీస్ రెండింట్లోనూ ఓటమి పాలవడం పట్ల మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. రెండు సిరీస్ ల్లోనూ ఓటమిపాలైనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని అన్నారు. టీమిండియాకు ఈ దశ తాత్కాలికమేనని, ఈ పరిస్థితులను టీమిండియా త్వరలోనే అధిగమిస్తుందని అభిప్రాయపడ్డారు.

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను టీమిండియా 1-2 తేడాతో కోల్పోగా, వన్డే సిరీస్ ను 0-3తో చేజార్చుకుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో వన్డే కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. అయితే టీమిండియా ఆటగాళ్లు పోరాడినప్పటికీ ఒక్క వన్డేలోనూ గెలవలేకపోయారు.

దీనిపై రవిశాస్త్రి మాట్లాడుతూ, "ఒక్క సిరీస్ ఓడిపోయామంటే విమర్శించడం మొదలుపెడతారు. ఎవరూ కూడా ప్రతి మ్యాచ్ గెలవలేరు. ఎక్కడైనా గెలుపోటములు సహజం" అని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో తాను ఒక్క మ్యాచ్ కూడా చూడలేదని, కానీ ఇప్పటికిప్పుడు జట్టు ప్రమాణాలు పడిపోయాయంటే నమ్మబోనని అన్నారు. ఐదేళ్లుగా టెస్టుల్లో నెంబర్ వన్ గా ఉన్న జట్టు ఆటతీరు ఒక్కసారిగా ఎలా క్షీణిస్తుందని ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా భారత జట్టు విజయాల శాతం 65గా ఉందని, అలాంటప్పుడు ఆందోళన చెందడం ఎందుకని అన్నారు. అలాంటి విజయాల శాతం చూసి ప్రత్యర్థి జట్లు ఆందోళన చెందాలని వ్యాఖ్యానించారు.

కోహ్లీ టెస్టు కెప్టెన్ గా తప్పుకోవడంపైనా రవిశాస్త్రి అభిప్రాయాలు పంచుకున్నారు. "అది అతని ఇష్టం. కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలి. దేనికైనా ఓ ముగింపు అనేది ఉంటుంది. అనేకమంది దిగ్గజ ఆటగాళ్లు తమ ఆటతీరుపై దృష్టి నిలిపేందుకు కెప్టెన్సీ వదులుకున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, ఎంఎస్ ధోనీ... ఇప్పుడు విరాట్ కోహ్లీ... ఇది సాధారణమైన విషయమే" అని పేర్కొన్నారు.

ఒక్క వరల్డ్ కప్ కూడా నెగ్గనంత మాత్రాన కోహ్లీ ఘనతలను తక్కువ చేసి చూడలేమని, చాలామంది పెద్ద ఆటగాళ్లు తమ కెరీర్ లో వరల్డ్ కప్ లేకుండా వీడ్కోలు పలికారని రవిశాస్త్రి తెలిపారు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేల కెరీర్ లో ఒక్క వరల్డ్ కప్ కూడా లేదన్న విషయాన్ని ప్రస్తావించారు.

సచిన్ అంతటివాడు కూడా వరల్డ్ కప్ గెలిచేందుకు ఎన్నో సంవత్సరాలు పట్టిందని అన్నారు. ఆరు వరల్డ్ కప్ లు ఆడిన తర్వాత కానీ సచిన్ వరల్డ్ కప్ నెగ్గలేకపోయాడని వివరించారు. కెరీర్ చివరి వరకు ఆటను ఎంత నిబద్ధతతో ఆడామన్నదే ముఖ్యమని, అదే ఆటగాళ్ల కెరీర్ కు కొలమానం అవుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.

ఇక, కెప్టెన్సీ విషయంలో కోహ్లీకి, బీసీసీఐకి మధ్య ఏం జరిగుంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ, ఏమీ తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండడమే మంచిదని హితవు పలికారు.


More Telugu News