మీ నుంచి హిందూ ఆలయాలకు, హిందూ ధర్మానికి రక్షణ ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది: విష్ణువర్ధన్ రెడ్డి

  • కర్నూలు జిల్లా బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్
  • జైలులో పరామర్శించిన కేంద్ర సహాయమంత్రి
  • విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు
  • బదులిచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి
రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్, కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్ జైలుకు వెళ్లి శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించడం తెలిసిందే. అయితే కేంద్ర సహాయమంత్రి జైలులో ఉన్న వ్యక్తిని పరామర్శించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. కేంద్రమంత్రి మురళీధర్ ను విమర్శిస్తూ రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేసి దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్న మీకు మా మంత్రిని విమర్శించే హక్కు ఉందా? అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలని పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీసులనే గాయపరిచి, పోలీసుల వాహనాన్ని తగులబెట్టిన వారిపై చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు. డీఎస్పీ పిలిస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వ్యక్తిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు, దీన్ని మేము చూస్తూ కూర్చోవాలా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎస్డీపీఐ కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని సాక్షాత్తు జిల్లా ఎస్పీ చెప్పిన తర్వాత కూడా మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దీన్నిబట్టి తీవ్రవాదులకు, దుర్మార్గులకు జగన్ ప్రభుత్వం కొమ్ముకాస్తోందన్న విషయం స్పష్టమవుతోందని వెల్లడించారు.

"ప్రభుత్వ సొమ్ముతో చర్చిలు, వక్ఫ్ భూములకు ప్రహరీలు కట్టిస్తున్నారు. పాస్టర్లు, ఇమాంలు, మౌజంలకు జీతాలు చెల్లిస్తున్నారు. మీ నుంచి హిందూ ఆలయాలకు, హిందూ ధర్మానికి రక్షణ ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది" అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు సాగిస్తున్న అరాచకపాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడే రోజు అతి త్వరలోనే వస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.


More Telugu News