ఒక్క బ‌ట‌న్ నొక్కి.. 3.92 లక్షల మంది అగ్రవర్ణ మ‌హిళ‌ల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున వేసిన సీఎం జ‌గ‌న్

  • వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం
  • లబ్ధిదారులకు రూ.589 కోట్లు విడుదల
  • అగ్రవర్ణ మహిళలకు మెరుగైన జీవనోపాధి కోసం అమ‌లు
  • ప‌థ‌కాన్ని మేనిఫెస్టోలో చెప్పకపోయినప్ప‌టికీ చేస్తున్నామన్న జ‌గ‌న్
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం జగన్ వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించారు. ఏపీలోని 3.92 లక్షల మంది లబ్ధిదారులకు రూ.589 కోట్లు విడుదల చేశారు. అగ్రవర్ణ మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారత కోసం ఈ ప‌థ‌కాన్ని జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని త‌న క్యాంపు క్యారాల‌యం నుంచి ప్రారంభించారు.

వర్చువల్‌గా జ‌రిగిన ఈ కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌చేశారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు సాయం చేస్తున్న‌ట్లు జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వ‌య‌సున్న అగ్ర‌వ‌ర్ణ మ‌హిళ‌ల‌కు ఈ డ‌బ్బులు జ‌మ‌చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటినీ తాము నెర‌వేర్చుతున్నామ‌ని చెప్పారు. ఈబీసీ నేస్తం ద్వారా బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, వెలమ వర్గాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామ‌ని వివ‌రించారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినప్ప‌టికీ ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తున్నామ‌ని జగన్ చెప్పారు. అగ్రవర్ణ పేదలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొచ్చామ‌ని వివ‌రించారు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ ఈ రోజు ఈ మంచి కార్యక్రమానికి శ్రీ కారం చుట్టామ‌ని వ్యాఖ్యానించారు.


More Telugu News