ఏపీకి, సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ సమావేశమే నిదర్శనం: విజయసాయిరెడ్డి

  • కేంద్ర కార్యదర్శులతో ఏపీ ప్రభుత్వ బృందం భేటీ
  • గత నెలలో మోదీని కలిసిన సీఎం జగన్
  • జగన్ ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలపై నేడు చర్చ
  • సానుకూల స్పందన వచ్చిందన్న విజయసాయి
ఏపీకి సంబంధించిన అంశాలపై కేంద్ర కార్యదర్శుల కమిటీతో ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం సమావేశం ముగిసింది. ఈ భేటీకి సంబంధించిన వివరాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో 20 మంది కేంద్ర ప్రభుత్వం అధికారులు, పీఎంవో అధికారులు పాల్గొన్నారని తెలిపారు.  

గత నెలలో సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రం ఇచ్చారని, ఆ పత్రంలోని అన్ని అంశాలపై సమావేశంలో చర్చ జరిగిందని వెల్లడించారు. ఏపీకి, సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకు ఈ సమావేశమే నిదర్శనమని అన్నారు.

పోలవరం సవరించిన అంచనాలను మార్పులు లేకుండా అంగీకరించేందుకు అవగాహన కుదిరిందని, పునరావాసం తదితర అంశాలపైనా ఆమోదయోగ్యమైన రీతిలో చర్చల సరళి ఉందని విజయసాయిరెడ్డి వివరించారు. మొత్తమ్మీద కేంద్ర కార్యదర్శులతో సమావేశం ఆశాజనకంగా సాగిందని, త్వరలోనే మంచి కబురు వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. అన్ని అంశాలకు తగిన పరిష్కారాలు లభించాయని పేర్కొన్నారు.

కాగా, ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బృందంలో విజయసాయితో పాటు రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా... ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు మంజూరు చేయాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని విజయసాయిరెడ్డి వెల్లడించారు.


More Telugu News