స్టాక్ మార్కెట్లో అమ్మకాల సునామీ.. భారీ నష్టాలతో ట్రేడింగ్

  • మూడు శాతానికి పైగా సూచీలు డౌన్
  • వరుసగా ఐదో సెషన్ లోనూ ప్రతికూలతలు
  • ఫెడరల్ రిజర్వ్ భేటీ, బడ్జెట్ కు ముందు అప్రమత్తత
  • వేచి చూడాలంటున్న విశ్లేషకులు
ఈక్విటీలు వరుసగా ఐదో సెషన్ లో, సోమవారం కూడా తీవ్ర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తుండడం, దేశీ ఇనిస్టిట్యూషన్స్ సైతం వేచి చూసే ధోరణిలో ఉండడంతో నష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా కొత్త తరం కంపెనీలైన జొమాటో, పేటీఎం, నైకా తదితర షేర్లతోపాటు, ఐటీ కంపెనీలు ఎక్కువ నష్టాలను చూస్తున్నాయి.

మిడ్ సెషన్ కు నిఫ్టీ 590 పాయింట్ల నష్టంతో (3.30 శాతం) 1,7000 స్థాయిలోను, సెన్సెక్స్ 1960 పాయింట్లు తగ్గి 57,000 స్థాయిలోనూ ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం మంగళవారం నుంచి జరగనుంది. 26న ఫెడ్ తన నిర్ణయాలను ప్రకటించనుంది. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ వైఖరి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది.

డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండడం, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రకటనకు ముందు ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ధోరణి తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ సెంటిమెంట్ భేరిష్ గా మారిందని.. వచ్చే కొన్ని వారాల పాటు అస్థిరతలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు తొందరపడి కొనుగోళ్లు, విక్రయాలు చేయకుండా వేచి చూడాలని సూచిస్తున్నారు.


More Telugu News