రైతు ఆత్మాభిమానం ఇలా ఉంటుంది!

  • కర్ణాటకలో ఘటన
  • వాహనం కొనేందుకు వెళ్లిన రైతు
  • కారు ధర రూ.10 కాదంటూ సేల్స్ మన్ వ్యంగ్యం
  • గంటలో రూ.10 లక్షలతో వచ్చిన రైతు
  • కారు డెలివరీ ఇవ్వాలని వెల్లడి
  • దిగ్భ్రాంతికి గురైన షోరూం సిబ్బంది
కర్ణాటకలోని తుముకూర్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ రైతు తన మిత్రులతో కలిసి మహీంద్రా వాహనం కొనేందుకు షోరూమ్ కు వెళ్లగా, వారి వేషభాషలు చూసిన అక్కడి సేల్స్ మన్ చులకనగా మాట్లాడాడు. దాంతో, ఆత్మాభిమానం పొంగుకొచ్చిన ఆ రైతు ఏంచేశాడో చూడండి!

కెంపె గౌడ ఓ రైతు. తన వ్యవసాయ అవసరాల నిమిత్తం బొలేరో పికప్ ట్రక్ కొనుగోలు చేసేందుకు షోరూమ్ కు వెళ్లాడు. అయితే కెంపెగౌడ మిత్రబృందాన్ని చూసిన షోరూమ్ సేల్స్ మన్ ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. వాహనం కొందామని వచ్చామని కెంపెగౌడ బదులిచ్చాడు. దాంతో ఆ సేల్స్ మన్ కారు ధర రూ.10 కాదంటూ ఎద్దేవా చేశాడు. ఆ మాటలతో కెంపె గౌడ ఆగ్రహానికి లోనయ్యాడు. కాసేపట్లోనే రూ.10 లక్షలు తీసుకువచ్చి వెంటనే బొలేరో పికప్ ట్రక్ ను తనకు అప్పగించాలని కోరాడు.

రైతు దూకుడు చూసిన షోరూమ్ సిబ్బంది నివ్వెరపోయారు. అప్పటికప్పుడు డెలివరీ ఇవ్వలేమని, మూడు రోజుల తర్వాత ఇస్తామని రైతుకు సర్దిచెప్పారు. కానీ ఆ సేల్స్ మన్ మాట్లాడిన మాటలను అవమానకరంగా భావించిన రైతు కెంపెగౌడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ షోరూమ్ సిబ్బంది రైతుకు, అతడి మిత్రులకు అందరిముందు క్షమాపణలు తెలిపారు. తాము తప్పు చేశామంటూ క్షమాపణ పత్రం కూడా అందజేశారు. ఏదేమైనా రైతు ఆత్మాభిమానం ఎలా ఉంటుందో ఆ షోరూం సిబ్బందికి బోధపడింది.


More Telugu News