ఐపీఎల్ 2022 భారత్ లోనా? దక్షిణాఫ్రికాలోనా?.. నేడు జరిగే పాలకమండలి సమావేశంలో నిర్ణయం

  • ప్లాన్ ఏ కింద భారత్ లోనే
  • ముంబై, నవీ ముంబై, పూణెలో
  • ఒకవేళ కుదరకపోతే ప్లాన్ బి
  • దక్షిణాఫ్రికాలో మ్యాచుల నిర్వహణ
ఐపీఎల్ 2022 (15వ) సీజన్ ను వచ్చే ఏప్రిల్ నుంచి ఎక్కడ నిర్వహించాలన్నది కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలో తగ్గుముఖం పట్టి, మార్చి నాటికి కరోనా ఒమిక్రాన్ ప్రభావం దాదాపు చివరి దశకు వస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో బీసీసీఐ ఆఫీసు బేరర్లు, ఐపీఎల్ పాలకమండలి సభ్యులు శనివారం భేటీ కానున్నారు. ఫ్రాంచైజీలతో కలసి చర్చించి వేదికను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించనున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు కూడా ఇందులో పాల్గొననున్నారు.

వీలైనంత వరకు స్థానికంగానే నిర్వహించాలని, లేదంటే దక్షిణాఫ్రికాకు వేదిక తరలించాలని ఐపీఎల్ గవర్నింగ్ బోర్డు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకానీ, గత రెండు సీజన్ల మాదిరిగా యూఏఈకి వెళ్లకూడదన్న అభిప్రాయంతో ఉంది. ఎప్పుడూ ఒకటే విదేశీ వేదికను నమ్ముకోవడం సరికాదని భావిస్తోంది. పైగా గత రెండు సీజన్లకు రూ.150 కోట్లు (2020లో రూ.100 కోట్లు, 2021లో రూ.50కోట్లు) చెల్లించింది. అంత ఖర్చు కూడా సరికాదన్న అభిప్రాయంతో ఉంది.  

గతంలో ఐపీఎల్ 2009 సీజన్ ను దక్షిణాఫ్రికాలోనే నిర్వహించారు. అప్పుడు ఎటువంటి అవరోధాల్లేకుండా విజయవంతంగా పూర్తయింది. ఐపీఎల్ 2022 సీజన్ కు ప్లాన్ ఏ కింద స్థానికంగానే ముంబై, నవీ ముంబై, పూణెలో నిర్వహించాలన్నది ప్రణాళిక. లేదంటే ప్లాన్ బి కింద దక్షిణాఫ్రికాకు వెళ్లాలన్నది యోచన. దీనిపై నేటి సమావేశంలో స్పష్టత రానుంది. అలాగే, 2023 నుంచి ఐదేళ్ల కాలానికి మీడియా రైట్స్ టెండర్ పైనా ఫ్రాంచైజీలకు స్పష్టత నిచ్చే అవకాశం ఉంది.


More Telugu News