ఆకలితో అలమటించిపోతున్న కుటుంబ సభ్యులు.. సుప్రీంకోర్టు వద్ద ఒంటికి నిప్పంటించుకున్న కుటుంబ పెద్ద

  • మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • కుటుంబ సభ్యుల ఆకలి కేకలు చూడలేకే ఈ పని చేశానన్న బాధితుడు
  • సుప్రీంకోర్టు వద్ద గత ఆరు నెలల్లో రెండో ఆత్మహత్యాయత్నం
కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించి పోతుంటే చూసి తట్టుకోలేకపోయిన కుటుంబ పెద్ద ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. అందుకు సుప్రీంకోర్టే కరెక్టనుకున్నాడు. అనుకున్న వెంటనే సర్వోన్నత న్యాయస్థానం వద్దకు చేరుకుని సజీవ దహనానికి యత్నించాడు.

నిన్న జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. మంటలు దహించి వేస్తుండడంతో బాధ తాళలేక అతడు కేకలు వేస్తూ కిందపడి దొర్లాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే బాధితుడిని రక్షించి మంటలు ఆర్పి లోక్ నాయక్ జయ్ ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు.

50 ఏళ్ల బాధితుడిని నోయిడాకు చెందిన రాజాబాబు గుప్తాగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీయగా అతడు చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. తమది నిరుపేద కుటుంబం కావడంతో భార్యాబిడ్డలకు బుక్కెడు బువ్వ కూడా పెట్టలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

వారంతా ఆకలితో అలమటిస్తుంటే చూడలేకపోతున్నానని, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్యే శరణ్యమని భావించానని చెప్పుకొచ్చాడు. కాగా, సుప్రీంకోర్టు ఎదుట ఆత్మహత్యకు యత్నించిన ఘటన గత ఆరు నెలల్లో ఇది రెండోది. గతేడాది ఆగస్టులో ఓ అత్యాచార బాధితురాలు (24) ఆత్మహత్యకు యత్నించింది.


More Telugu News