జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర్ జవాన్ జ్యోతి విలీనం పూర్తి

  • 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతి
  •  జాతీయ యుద్ధ స్మారకం వద్ద జ్యోతి విలీనం
  • ఇదే నిజమైన నివాళి అవుతుందన్న కేంద్రం
ఢిల్లీలో గత 50 సంవత్సరాలుగా నిరంతరం జ్వలిస్తున్న అమర్ జవాన్ జ్యోతి స్థానం మారింది. ఈ జ్యోతిని తీసుకువెళ్లి జాతీయ యుద్ధ స్మారకం వద్ద విలీనం చేశారు. దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద గత ఐదు దశాబ్దాలుగా అమర్ జవాన్ జ్యోతి వెలుగుతోంది. అయితే ఈ జ్యోతిని ఇక్కడికి సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ బీఆర్ కృష్ణ నేతృత్వంలో ఇవాళ జ్యోతి విలీన ప్రక్రియను పూర్తి చేశారు.

అమర్ జవాన్ జ్యోతి వద్ద అమరవీరుల పేర్లన్నీ లేకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరుల పేర్లన్నీ ఉన్నాయని, జ్యోతి ఇక్కడ ఉండడమే నిజమైన నివాళి అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు విపక్షాలకు వివరణ ఇచ్చింది. అమర్ జవాన్ జ్యోతిని యుద్ధ స్మారకం వద్దకు తరలిస్తున్నామని స్పష్టం చేసింది.

1971 ఇండో-పాక్ యుద్ధంలో 25,942 మంది భారత సైనికులు అమరులయ్యారు. వారందరి పేర్లను జాతీయ యుద్ధ స్మారకం (నేషనల్ వార్ మెమోరియల్) వద్ద సువర్ణాక్షరాలతో లిఖించారు.


More Telugu News