విజయవాడ డీఆర్ఎంకు లేఖ రాసిన గల్లా జయదేవ్

  • ఇందిరానగర్ లో వెయ్యికి పైగా కుటుంబాల నివాసం
  • ఖాళీ చేయాలంటూ రైల్వే అధికారుల నోటీసులు
  • అవి రైల్వే భూములని స్పష్టీకరణ
  • ప్రత్యామ్నాయం చూపేంతవరకు ఆగాలన్న జయదేవ్
తాడేపల్లి ఇందిరానగర్ వాసులను ఇళ్లు ఖాళీ చేయాలంటూ రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడంతో, దాదాపు వెయ్యికి పైగా కుటుంబాలు దీక్ష చేపట్టాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. తాడేపల్లి రైల్వే భూముల్లో నివాసం ఉంటున్న వారిని జనవరి 22 లోగా ఖాళీ చేయాలని రైల్వే శాఖ అధికారులు నిన్న ఆదేశించారని తెలిపారు.

దీనిపై తాను విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎమ్)కు లేఖ రాసినట్టు తెలిపారు. తాడేపల్లి ఇందిరానగర్ వాసులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించేంతవరకు ప్రస్తుతం ఉన్న చోటే నివసించేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఇందిరానగర్ వాసులు చేపట్టిన దీక్షకు జనసేన పార్టీ మద్దతు పలికింది. బాధితులకు అండగా నిలుస్తామని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు.


More Telugu News