పగలు ఫ్లాట్ క్లీనింగ్ పని .. రాత్రి ఫ్లాట్ 'ఖాళీ' పని!

  • రాత్రి సమయంలో దొంగ రూపంలోనూ రావొచ్చు
  • ఎస్సార్ నగర్ పీఎస్ పరిధిలో ఇటువంటిదే ఘటన
  • అర్బన్ క్లాప్ తరఫున పగలు మరమ్మతులు
  • రాత్రి వచ్చి భారీ దొంగతనం
అపార్ట్ మెంట్ లో ఉంటే భద్రత ఉంటుందని భావించడానికి వీల్లేదు. దొంగలు తెలివిగా వ్యవహరిస్తే ఇంటి యజమానికి నష్టం తప్పదు. పక్క ఫ్లాట్ వారు జాగ్రత్తగా వ్యవహరించక పోయినా పొరుగింటికి కన్నం పడే ప్రమాదం లేకపోలేదు. ఇందుకు నిదర్శనమే ఈ చోరీ ఘటన.

హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో ఇటీవలే ఒక అపార్ట్ మెంట్ లో చోరీ జరిగింది. తాళం వేసిన ఉన్న ఫ్లాట్ లోకి చొరబడిన దొంగ 600 గ్రాములకు పైగా బంగారం, రూ.22 లక్షల నగదుతో ఉడాయించాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా చిదిరిక అరవింద్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్టు గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ వివరాలను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.

వరంగల్ జిల్లా నడికుడి గ్రామానికి చెందిన అరవింద్ 2015లో హైదరాబాద్ కు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. వ్యసనాలకు లోనై దొంగతనాలకు మళ్లాడు. ఇప్పటి వరకు 27 దొంగతనాలు చేసినట్టు గుర్తించారు. అర్బన్ క్లాప్ కంపెనీలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ నెల 12న అర్బన్ క్లాప్ కంపెనీ నుంచి ఫ్లాట్ క్లీనింగ్ పని అతనికి లభించింది.

దీంతో రాజీవ్ నగర్ లోని అపార్ట్ మెంట్ ఫ్లాట్ కు క్లీనింగ్ పనికి వెళ్లిన సందర్భంగా అతడు పక్కనే తాళం వేసిన ఫ్లాట్ ను గమనించాడు. అదే రోజు అర్ధరాత్రి వెళ్లి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు.  


More Telugu News