విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ కి నారా లోకేశ్ లేఖ

  • తాడేపల్లి రైల్వే స్థలాల్లో ఉంటున్న వారిని ఇబ్బంది పెట్టొద్దు
  • 40 ఏళ్లుగా వారు అక్కడే ఉంటున్నారు
  • వారిని వేరే చోటుకు తరలించేంత వరకు ఇళ్లు కూల్చొద్దు
విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో రైల్వే స్థలాల్లో నివాసితులకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు వారిని వేరే చోటుకు తరలించేంత వరకు... రైల్వే అధికారులు ఇళ్లు కూల్చకుండా సమయం ఇచ్చేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సుమారు 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని... వీరందరూ పనికెళ్తే కానీ పూట గడవని దయనీయ స్థితిలో బతుకుతున్నారని లోకేశ్ పేర్కొన్నారు. జనవరి 22లోపు ఇళ్లు ఖాళీ చేయాలని ఉన్నట్టుండి రైల్వే అధికారులు వారికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈ నోటీసులతో అక్కడ నివసిస్తున్న ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. కరోనా కారణంగా పనులు లేక, పూట గడవడమే ఇబ్బందిగా మారిన వాళ్లకి... రైల్వే నోటీసులతో నిలువ నీడ కూడా లేకుండా పోతుందని అన్నారు. వీరికి వీలైనంత త్వరగా ప్రభుత్వం స్థలం కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు.


More Telugu News