కోహ్లీకి షోకాజ్ నోటీసు ఇద్దామనుకున్న గంగూలీ.. నిలువరించిన జయ్ షా!

  • గంగూలీకి విరుద్ధంగా కోహ్లీ ప్రకటన
  • 90 నిమిషాల ముందే చెప్పారు
  • వన్డే కెప్టెన్ గా తప్పించడంపై కోహ్లీ వాదన
  • షోకాజు నోటీసుతో వివరణ కోరాలనుకున్న గంగూలీ  
  • జట్టుపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుందన్న ఆందోళన
  • జయ్ షా జోక్యంతో వెనక్కి తగ్గిన గంగూలీ
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ తీరుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆగ్రహాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఆ మధ్య కోహ్లీ ప్రెస్ మీట్ పెట్టి, వన్డే జట్టు కెప్టెన్ గా తప్పించే విషయమై బోర్డు తననేమీ సంప్రదించలేదని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. సరిగ్గా 90 నిమిషాల ముందు కాల్ చేసి, కెప్టెన్ గా తప్పిస్తున్నట్టు చెప్పారని బయటపెట్టాడు. ఇదే అసలు వివాదానికి కేంద్ర బిందువు.

కోహ్లీ వాదన అంతకుముందు అతడి విషయంలో గంగూలీ చేసిన ప్రకటనకు భిన్నంగా ఉంది. టీ20 కెప్టెన్సీని విడిచిపెట్టొద్దని తాను కోహ్లీకి సూచించినా, వినిపించుకోలేదని గంగూలీ అన్నారు. టీ20 సారథ్యం వదులుకోవడంతో, వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తీసేయాల్సి వచ్చిందన్నది గంగూలీ ప్రకటనలోని అంతరార్థం. కానీ, టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ వదులుకోవద్దని తనకు ఎవరూ సూచించలేదని కోహ్లీ స్పష్టం చేశాడు. దీంతో కోహ్లీకి ఇష్టం లేకపోయినా బీసీసీఐ అతడ్ని వన్డే జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పించేసిందన్న విమర్శలు వచ్చాయి.

కోహ్లీ వాదనలు గంగూలీకి అసహనం తెప్పించినట్టు, అతడిని వివరణ కోరుతూ షోకాజు నోటీసు జారీ చేయాలని భావించినట్టు తెలిసింది. కాకపోతే బీసీసీఐ కార్యదర్శి జయ్ షా జోక్యం చేసుకుని గంగూలీకి సర్దిచెప్పినట్టు సమాచారం. కోహ్లీ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ముందు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ సమయంలో అతడికి షోకాజు నోటీసు ఇస్తే జట్టుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అది జరగకూడదని బోర్డు భావించడంతో గంగూలీ వెనక్కి తగ్గినట్లు తెలిసింది. లేదంటే ఇది పెద్ద రచ్చయ్యేదేమో!


More Telugu News