ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ‌లో ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు: విజ‌య‌శాంతి

  • ముందస్తు జాగ్రత్త కోసమే విద్యాసంస్థలను మూసివేస్తున్నామన్నారు
  • బార్‌లు, పబ్‌లను ఎందుకు మూయ‌లేదు?
  • అదే ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదో చెప్పాలి
  • ఆదాయం కోసమే వాటిని నియంత్రించకుండా చోద్యం చూస్తున్రు అంటున్న విజయశాంతి 
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈమేరకు ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు.

'రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థులకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని గప్పాలు కొట్టిన సీఎం కేసీఆర్... ఉచిత విద్య దేవుడెరుగు, ఉన్న ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో మూసివేసి, మారుమూల గ్రామాల విద్యార్థులకు సర్కారీ విద్యను దూరం చేసి పేద తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని పెంచారు.

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడతామంటూ కొత్త డ్రామా మొదలెట్టారు. అసలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, పిల్లల కోసం టాయిలెట్లు కూడా నిర్మించని దుస్థితి. ఇక ధనిక రాష్ట్రం మనదని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ ఏనాడూ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు.

అలాంటిది నేడు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం పేరుతో ప్రజల్ని మరోమారు తప్పుదోవ పట్టిస్తూ కార్పొరేట్‌ స్కూళ్ల నుంచి డబ్బులు వసూలు చేయడం కోసమే ఈ ప్రతిపాదన చేసిన్రు తప్ప పేద విద్యార్థుల పట్ల ప్రేమతో మాత్రం కాదని స్పష్టంగా అర్థ‌మవుతోంది.

రాష్ట్రంలో ఏడేండ్లుగా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటివరకు నోటిఫికేషన్‌ జారీ చేయకుండా... విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యను ఎలా అందిస్తారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. కేంద్రం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని తెలంగాణలో అమలుచేస్తే... రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం మేరకు సీట్లు పేద విద్యార్థులకు దక్కేవి. కానీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పేరుతో విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో కేసీఆర్‌ అమలు చేయకుండా ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేస్తున్రు .

ఇక కరోనా పేరుతో ముందస్తు జాగ్రత్త కోసమే విద్యాసంస్థలను మూసివేస్తున్నామని చెప్పిన కేసీఆర్‌... బార్‌లు, పబ్‌ల మూసివేత విషయంలో అదే ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదో చెప్పాలి. పబ్బులు, బార్లల్లో కొవిడ్‌ మరణాలు చోటు చేసుకుంటున్నా ఆదాయం కోసమే వాటిని నియంత్రించకుండా చోద్యం చూస్తున్రు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి పూనుకుని రాజకీయనాటకాలకు తెరతీస్తున్న ఈ దగాకోరు ముఖ్యమంత్రికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం' అంటూ విజ‌య‌శాంతి మండిపడ్డారు.


More Telugu News