అరుణాచల్‌ప్రదేశ్ కుర్రాడి కోసం చైనా ఆర్మీతో భారత సైన్యం సంప్రదింపులు

  • అరుణాచల్ ప్రదేశ్ నుంచి అదృశ్యమైన 17 ఏళ్ల మిరాం తరోన్
  • పీఎల్ఏ అపహరించినట్టు ఆరోపణ
  • ప్రొటోకాల్ ప్రకారం అతడిని గుర్తించి అప్పగించాలన్న భారత్
  • కిడ్నాప్ విషయమే తమకు తెలియదన్న చైనా
అరుణాచల్ ప్రదేశ్‌లో అపహరణకు గురైన 17 ఏళ్ల మిరాం తరోన్‌ కోసం భారత సైన్యం చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ని సంప్రదించింది. ఈ మేరకు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ప్రొటోకాల్ ప్రకారం అతడిని గుర్తించి తమకు అప్పగించాల్సిందిగా పీఎల్‌ఏను కోరినట్టు పేర్కొన్నాయి.

అదృశ్యమైన మిరాం తరోన్‌ను చైనా ఆర్మీ ఈ నెల 18న కిడ్నాప్ చేసినట్టు అరుణాచల్‌ ప్రదేశ్ ఎంపీ తాపిర్ గావో ఆరోపించారు. చైనా ఆర్మీ చెర నుంచి తప్పించుకున్న మరో యువకుడు స్థానిక అధికారులకు సమాచారం అందించడంతో ఈ కిడ్నాప్ వ్యవహారం వెలుగుచూసినట్టు ఆయన పేర్కొన్నారు.

చైనా చెర నుంచి మిరాంను విడిపించాలని భారత ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. షియాంగ్ జిల్లాలోని సియుంగా ప్రాంతం నుంచి చైనా ఆర్మీ అతడిని కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. మిరోంతోపాటు, చైనా ఆర్మీకి చిక్కకుండా తప్పించుకున్న మరో యువకుడు జిడో గ్రామానికి చెందిన వేటగాళ్లని ఎంపీ తెలిపారు.

ఔషధ మొక్కల కోసం గాలిస్తూ దారితప్పి చైనా ఆర్మీకి చిక్కారని ఎంపీ పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఈ విషయమై స్పందించారు. భారత రక్షణ శాఖ దౌత్య మార్గాల ద్వారా ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని చెప్పారు. కిడ్నాపైన కుర్రాడు త్వరలోనే క్షేమంగా ఇంటికి చేరుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఈ విషయమై స్పందించిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు నిన్న మాట్లాడుతూ.. కిడ్నాప్ విషయం తమకు తెలియదన్నారు. తమ సైన్యం సరిహద్దులో అప్రమత్తమంగా ఉంటుందని, అక్రమ చొరబాట్లను అణచివేస్తుందని అన్నారు.


More Telugu News