నెటిజన్ల ఆగ్రహంతో దిగొచ్చిన ‘నెస్లే ఇండియా’.. కిట్‌కాట్ రేపర్లపై దేవుడి బొమ్మలు ముద్రించినందుకు క్షమాపణ

  • చాక్లెట్ కవర్లపై జగన్నాథస్వామి, బలభద్ర, సుభద్ర బొమ్మలు
  • చాక్లెట్ తిన్నాక కవర్లు చెత్తకుప్పల్లోకి, మురికి కాల్వల్లోకి వెళ్తాయంటూ ఆగ్రహం
  • క్షమాపణలు చెప్పి.. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ‘నెస్లే ఇండియా’
‘కిట్‌కాట్’ చాక్లెట్ రేపర్ (కవర్)పై దేవుడి బొమ్మలు ముద్రించి విమర్శల పాలైన ప్రముఖ చాక్లెట్ కంపెనీ ‘నెస్లే ఇండియా’ క్షమాపణలు తెలిపింది. దేవుళ్ల బొమ్మలతో ఉన్న చాక్లెట్లను వెనక్కి తెప్పిస్తున్నట్టు పేర్కొంది. చాక్లెట్ కవర్లపై పూరి జగన్నాథస్వామి, బలభద్ర, సుభద్రల చిత్రాలను కిట్‌కాట్ ముద్రించింది. చాక్లెట్ కవర్లపై తాము ఆరాధించే దేవుళ్ల బొమ్మలు ముద్రించడమంటే తమ మత విశ్వాసాలను కించపరచడమేనంటూ సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చాక్లెట్ తిన్నాక రేపర్లు చెత్త కుప్పల్లోకి, మురికి కాల్వల్లోకి వెళ్తాయని, కాబట్టి వెంటనే ఇలాంటి పనికి స్వస్తి చెప్పాలని డిమాండ్  చేశారు. స్పందించిన నెస్లే ఇండియా నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఒడిశా సంప్రదాయాన్ని ఇతర ప్రాంతాలకు కూడా పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే దేవుళ్ల బొమ్మలను కవర్లపై ముద్రించాం తప్పితే, అందులో ఎలాంటి చెడు అభిప్రాయం లేదని వివరణ ఇచ్చింది. కళను, కళాకారులను ప్రోత్సహించాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు, దేవుళ్ల బొమ్మలు ఉన్న చాక్లెట్లను వెనక్కి రప్పిస్తున్నట్టు తెలిపింది.


More Telugu News