2021 మెన్స్ వన్డే టీమ్ ను ప్రకటించిన ఐసీసీ.. ఒక్క టీమిండియా ప్లేయర్ కూ దక్కని చోటు!

  • కెప్టెన్ గా బాబర్ ఆజం ఎంపిక
  • ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లకు చోటు
  • ఇద్దరు ఐర్లాండ్ ప్లేయర్లకూ అవకాశం
2021కి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 11 మంది సభ్యులతో మెన్స్ వన్డే టీమ్ ను ప్రకటించింది. అయితే ఐసీసీ వన్డే టీమ్ లో ఒక్క టీమిండియా ఆటగాడికీ చోటు దక్కకపోవడం గమనార్హం. ఆ జట్టుకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను కెప్టెన్ గా ఎంచుకుంది. గత ఏడాది మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్ల పేర్లతో టీమ్ ను ప్రకటించినట్టు ఐసీసీ వెల్లడించింది.

జట్టులో పాల్ స్టిర్లింగ్, జానిమన్ మలాన్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, రాసీ వాండర్ డూసెన్, షకీబ్ అల్ హసన్, ముష్ఫిఖర్ రహీమ్, వహిందు హసరంగ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సిమి సింగ్, దుష్మంత చమీరాలకు చోటిచ్చింది. బంగ్లాదేశ్ నుంచి ముగ్గురు, ఐర్లాండ్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం.

పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్): గత ఏడాది 705 పరుగులు చేసిన అతడు.. ఆ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 14 మ్యాచ్ లలో 79.66 సగటుతో ఆ పరుగులు చేశారు. అందులో మూడు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలున్నాయి.

మలాన్ (సౌతాఫ్రికా): 8 మ్యాచ్ లలో 84.83 సగటుతో 509 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలున్నాయి. ఇంటా బయటా అతడు స్థిరంగా ఆడాడని ఐసీసీ పేర్కొంది.

బాబర్ ఆజం (పాకిస్థాన్): గత ఏడాది ఆడింది 6 వన్డేలే అయినా 67.5 సగటు, రెండు సెంచరీల సాయంతో 405 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తో టూర్ లో మెరుగ్గా రాణించాడు. అందుకే కెప్టెన్ గా అతడినే ఎన్నుకున్నట్టు ఐసీసీ చెప్పింది.

ఫఖర్ జమాన్ (పాకిస్థాన్): గత ఏడాది ఆడిన 6 మ్యాచ్ లలో 60.83 సగటుతో 365 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం ఉంది.

రాసీ వాండర్ డూసెన్ (సౌతాఫ్రికా): 8 మ్యాచ్ లలో 57 సగటుతో 342 పరుగులు. ఒక సెంచరీ ఉంది.

షకీబల్ హసన్ (బంగ్లాదేశ్): ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ తో గత ఏడాదిని ముగించాడు. రెండు అర్ధ సెంచరీలతో 277 పరుగుల చేశాడు. 17 వికెట్లు కూల్చాడు.

ముష్ఫికర్ రహీం (బంగ్లాదేశ్): గత ఏడాది 9 మ్యాచ్ లలో 58.14 సగటుతో 407 పరుగులు. ఒక సెంచరీ చేశాడు. వికెట్ కీపర్ గా అతడికి అవకాశం.

వహిందు హసరంగ (శ్రీలంక): బ్యాటుతో 356 పరుగులు, బంతితో 12 వికెట్లు తీసి ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బౌలింగ్ ఎకానమీ కేవలం 4.56.

ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్): గత ఏడాది ఆడిన 10 మ్యాచ్ లలో 18 వికెట్లు తీశాడు. బౌలింగ్ సగటు 5.03.

సిమి సింగ్ (ఐర్లాండ్): 13 మ్యాచ్ లలో 19 వికెట్లు కూల్చాడు. అందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. అంతేకాదు.. బ్యాటుతోనూ రాణించాడు. ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సాయంతో 280 పరుగులు చేశాడు.

దుష్మంత చమీర (శ్రీలంక): గత ఏడాది తన పేస్ వాడితో అందరినీ ఆకర్షించాడు. 14 మ్యాచ్ లాడిన అతడు ఒక ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మొత్తం 20 వికెట్లు తీశాడు.


More Telugu News