చైనా సైన్యం దుందుడుకు చర్య.. భారత బాలుడి అపహరణ

  • ప్రకటించిన రాష్ట్ర ఎంపీ తపిర్ గావో
  • తప్పించుకున్న మరో బాలుడు
  • భారత ప్రాదేశిక ప్రాంతంలోకి చొరబడి దుశ్చర్య
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మరోసారి భారత సరిహద్దుల్లో దుశ్చర్యకు పాల్పడింది. అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సియాంగ్ జిల్లాకు చెందిన 17ఏళ్ల బాలుడు మిరమ్ తరోన్ ను చైనా సైనికులు అపహరించి తీసుకుపోయారు. ఈ విషయాన్ని రాష్ట్రానికి చెందిన ఎంపీ తపిర్ గావో ట్వీట్ చేశారు.

బాలుడ్ని భారత ప్రాదేశిక ప్రాంతమైన లుంగ్తాజోర్ (లుంగ్తా జోర్) నుంచి మంగళవారం తీసుకువెళ్లినట్టు తపిర్ గావో ప్రకటించారు. ఈ ప్రాంతంలో చైనా 2018లో 3-4 కిలోమీటర్ల రహదారిని అక్రమంగా నిర్మించింది.

అతడ్ని వెంటనే విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నితీష్ ప్రమాణిక్ ను కోరినట్టు ఎంపీ తెలిపారు. తన ట్వీట్లను ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, రక్షణ మంత్రులకు ట్యాగ్ చేశారు.

మిరమ్ తరోన్ ను అపహరించుకుపోయే క్రమంలో అతడి స్నేహితుడు జానీ యాయింగ్ సైతం పక్కనే ఉన్నాడు. కాకపోతే అతడు చైనా సైనికుల నుంచి తెలివిగా తప్పించుకోవడంతో ఈ విషయం వెలుగు చూసింది.

ఈ విషయంపై భారత సైన్యం కూడా వేగంగానే స్పందించి చైనా పీఎల్ఏ అధికారులతో మాట్లాడింది. మూలికలను సేకరించేందుకు వెళ్లి మార్గం తప్పిపోయాయడని, కనిపించడం లేదని తెలియజేసింది. ఈ విషయంలో చైనా సైన్యం సహకారం కావాలని. సంబంధిత బాలుడ్ని గుర్తించి, తమకు అప్పగించాలని కోరింది.  


More Telugu News