తల్లి అంత్యక్రియల్లో ఆస్తి కోసం గొడవ.. కుమారులిద్దరూ పోటాపోటీగా తలకొరివి!

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
  • కుమారులిద్దరికీ పంచగా మిగిలిన ఆస్తి కోసం గొడవలు
  • తల్లి చితి చుట్టూ తిరిగే విషయంలో తోపులాట
బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు అంతా మిథ్యేనని.. అవి కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయని నిరూపించే ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా, తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తమను పెంచి, పెద్ద చేసి సమాజంలో గౌరవం, హోదా ఇచ్చిన తల్లి మరణిస్తే ఆమెకు అంత్యక్రియలు చేయాల్సిన కుమారులు శవం వద్దే కొట్లాడుకున్నారు. ఆస్తి తనకు దక్కాలంటే, తనకు దక్కాలంటూ గొడవ పడ్డారు. చివరికి ఇద్దరూ కలిసి పోటాపోటీగా తలకొరివి పెట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన మల్లారం యశోద, భూమిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరందరికీ వివాహం కాగా, భూమిరెడ్డి తనకున్న ఎకరంన్నర పొలంలో పెద్దకుమారుడు రామకిష్టారెడ్డి, చిన్న కుమారుడు రవీందర్‌రెడ్డికి చెరో 20 గుంటల స్థలాన్ని పంచారు. మిగిలిన భూమిని తన వద్దే అట్టేపెట్టుకున్నారు. అయితే, మిగిలిన ఆస్తిని కూడా తమకు పంచాలని కుమారులిద్దరూ తండ్రితో గొడవ పడేవారు. చివరికి ఈ గొడవ కుల పెద్దల పంచాయతీకి చేరగా, తల్లిదండ్రులను చివరి వరకు చూసే వారికే మిగిలిన ఆస్తి దక్కుతుందని తీర్పు చెప్పారు.

దీంతో కుమారులిద్దరూ నెలకొకరు చొప్పున తల్లిదండ్రులను చూసుకుంటూ వచ్చారు. గత ఐదు నెలలుగా తల్లిదండ్రులిద్దరూ పెద్ద కుమారుడి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో యశోద (92) నిన్న మృతి చెందింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుమారులు ఆమె మృతదేహాన్ని అక్కడే పెట్టుకుని ఆస్తి కోసం గొడవకు దిగారు. ఆస్తి తనకు దక్కాలంటే, కాదు తనకే దక్కాలంటూ కలబడ్డారు. తల్లి చితి చుట్టూ తిరిగే విషయంలోనూ ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. చివరికి ఇద్దరూ పోటీపడి తల్లికి తలకొరివి పెట్టారు. ఇదంతా చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.


More Telugu News