అండర్-19 ప్రపంచకప్.. ఐర్లండ్‌ను చిత్తుగా ఓడించిన యువ భారత్

  • 174 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత జట్టు
  • 39 ఓవర్లలో 133 పరుగులకు కుప్పకూలిన ఐర్లండ్
  • బ్యాట్‌తో చెలరేగిన ఓపెనర్ హర్నూర్‌సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
  • సూపర్ లీగ్ దశకు అర్హత
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్ల జట్టు చెలరేగిపోతోంది. ట్రినిడాడ్ అండ్ టొబాగాలో జరుగుతున్న ఈ పోటీల్లో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను కంగుతినిపించిన భారత జట్టు నిన్న ఐర్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. ఓపెనర్లు అంగ్‌క్రిష్ రఘువంశీ (79), హర్నూర్ సింగ్ (88) చెలరేగిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.

కరోనా నేపథ్యంలో కెప్టెన్ యశ్‌దుల్‌తోపాటు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనప్పటికీ కుర్రాళ్ల జోరు మాత్రం తగ్గలేదు. జట్టును నడిపించిన నిశాంత్ సింధు 36, రాజ్ బవా 42, రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్ 39 (నాటౌట్) పరుగులు చేశారు. అనంతరం 308 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లండ్ కేవలం 39 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. దీంతో 174 పరుగుల భారీ తేడాతో భారత యువజట్టు విజయం సాధించింది.

ఇక ఆ జట్టులో స్కాట్ మాక్‌బెత్ చేసిన 32 పరుగులే అత్యధికం. వికెట్ కీపర్ జోషువా కాక్స్ 28 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో గర్వ్ సంగ్వాన్, అనీశ్వర్ గౌతమ్, కౌశ్ తాంబే చెరో రెండు వికెట్లు తీసుకోగా, రాజ్‌వర్ధన్, రవికుమార్, విక్కీ ఓస్త్వాల్ చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగులో దుమ్మురేపిన హర్నూర్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత జట్టు సూపర్ లీగ్ దశకు అర్హత సాధించింది.


More Telugu News