మేనకాగాంధీ, వరుణ్ గాంధీలకు షాకిచ్చిన బీజేపీ అధిష్ఠానం!

  • 30 మందితో కూడిన యూపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ
  • జాబితాలో కనిపించని మేనక, వరుణ్ ల పేర్లు
  • లఖీంపూర్ ఘటనపై ఇటీవల బీజేపీపై విమర్శలు గుప్పించిన వరుణ్
మేనకాగాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలకు బీజేపీ అధిష్ఠానం షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో వీరికి చోటు కల్పించలేదు. 30 మంది స్టార్ క్యాంపెయినర్లతో కూడిన జాబితాను బీజేపీ ఈరోజు విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఉన్నారు.

యూపీలోని సుల్తాన్ పూర్, ఫిలిబిత్ ల నుంచి తల్లీకొడుకులు ఇప్పటి వరకు అనేకసార్లు గెలిచారు. బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. అయినప్పటికీ ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి వీరిని తొలగించిన అధిష్ఠానం తాజాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి కూడా తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన లఖీంపూర్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపై నుంచి కారును నడిపి పలువురి మరణానికి కారణమయ్యారు. దీనిపై వరుణ్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... సొంత పార్టీ బీజేపీని ప్రశ్నిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించలేదని ఆయన విమర్శించారు. దీంతో బీజేపీ అధిష్ఠానం వీరిపై ఆగ్రహంగా ఉంది.


More Telugu News