నాలుగో డోసు వేసుకున్నా వదిలిపెట్టని ఒమిక్రాన్!

  • ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
  • నాలుగో డోసు వేసుకున్నా రక్షణ పాక్షికమే
  • యాంటీబాడీలను ఏమారుస్తున్న వైరస్
కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ ప్రమాదకారా? కాదా? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పక్కనపెడితే టీకా వేసుకున్నా అదిమాత్రం వదిలిపెట్టదని మరోమారు రుజువైంది. నాలుగో డోసు వేసుకున్నా ఒమిక్రాన్ నుంచి పూర్తిస్థాయి రక్షణ లభించదని తాజా పరిశోధనలో వెల్లడైంది. నాలుగో డోసుతో శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నప్పటికీ అవి వైరస్ సోకకుండా అడ్డుకోలేకపోతున్నట్టు ఇజ్రాయెల్‌లోని షెబా మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

టీకాలు ఏ మేరకు సురక్షితం, అవి ఎంత వరకు సమర్థంగా పనిచేస్తాయన్న దానిని వీరు పరిశీలించారు. ఇందులో భాగంగా తమ మెడికల్ సెంటర్ సిబ్బందికి రెండో బూస్టర్ డోసు.. అంటే నాలుగో డోసు ఇచ్చారు. వీరిలో 154 మందికి ఫైజర్ టీకా ఇవ్వగా, 120 మందికి మోడెర్నా టీకాలు ఇచ్చారు. బూస్టర్ డోసులు తీసుకున్న అందరిలోనూ వారం తర్వాత యాంటీబాడీలు గణనీయంగా పెరిగాయి. రెండు వారాల తర్వాత ఫైజర్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీల సంఖ్య మరింత పెరిగింది.

ఇక, టీకాలు ఎంతమేరకు సురక్షితమన్న దానిపై జరిగిన పరిశోధనలో రెండు టీకాలు ఒకే స్థాయిలో ఉన్నట్టు తేలింది. నాలుగో డోసు వల్ల యాంటీబాడీలు పెరిగినప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కొంత మేరకు మాత్రమే రక్షణ లభిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ టీకా సామర్థ్యాన్ని ఏమారుస్తున్నట్టు పరిశోధనలో తేలినట్టు చెప్పారు.


More Telugu News