పగ తీర్చుకున్న సౌదీ సంకీర్ణ దళాలు.. హౌతీ మిలటరీ అత్యున్నత అధికారి సహా 20 మంది హతం!

  • వైమానిక దాడులతో విరుచుకుపడిన సంకీర్ణ దళాలు
  • హౌతీ ఏవియేషన్ కాలేజీ మాజీ హెడ్, ఆయన భార్య, కుమారుడు మృతి
  • 2019 తర్వాత అతి పెద్ద దాడి ఇదే
అబుదాబిపై యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడికి సౌదీ ప్రతీకారం తీర్చుకుంది. హౌతీల అధీనంలోని యెమెన్ రాజధాని సనాపై సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు వైమానిక దాడికి దిగాయి. హౌతీ మిలటరీలోని అత్యున్నత స్థాయి అధికారి, హౌతీల ఏవియేషన్ కాలేజీ మాజీ హెడ్ అబ్దుల్లా ఖాసిమ్ అల్ జునైద్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని వైమానిక దళం జరిపిన దాడుల్లో జునైద్, ఆయన భార్య, 25 ఏళ్ల వారి కుమారుడు, పౌరులు సహా దాదాపు 20 మంది మరణించినట్టు హౌతీ మీడియా తెలిపింది.

2019 తర్వాత సౌదీ సంకీర్ణ దళాలు జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని పేర్కొంది. దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన 8 డ్రోన్‌లను అడ్డుకున్నట్టు దళాలు తెలిపాయి. అబుదాబి దాడి తమపనేనని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించిన నేపథ్యంలోనే సంకీర్ణ దళాలు ఇలా ప్రతీకార చర్యకు దిగాయి. కాగా, సోమవారం హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మరణించారు.


More Telugu News