ఈసారి కూడా కరోనా ఆంక్షల నడుమ రిపబ్లిక్ డే పరేడ్

  • జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం
  • ముస్తాబవుతున్న ఢిల్లీ రాజ్ పథ్
  • ఢిల్లీలో కరోనా తీవ్రరూపం 
  • పరేడ్ కు 24 వేల మందికే అనుమతి
భారత గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే (జనవరి 26) సమీపిస్తోంది. ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తుండడంతో, ఈసారి కూడా ఆంక్షల నడుమ రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరేడ్ కు కేవలం 24 వేల మందినే అనుమతించనున్నారు. వారిలో 19 వేల మంది ఆహ్వానితులు కాగా, మిగిలిన వారు ప్రజలు. ప్రజలు టికెట్లు కొనుక్కొని రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కావాల్సి ఉంటుంది.

దేశ రాజధానిలో ఉదయం వేళ విపరీతంగా మంచు కురుస్తుండడంతో అరగంట ఆలస్యంగా 10.30 గంటలకు పరేడ్ ప్రారంభం కానుంది. తద్వారా ప్రజలు సైనిక విన్యాసాలను, శకటాలను స్పష్టంగా వీక్షించే అవకాశం ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించే రాజ్ పథ్ లో 10 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.

గతేడాది కూడా కరోనా చెలరేగడంతో 25 వేల మందితో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. 2020లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు 1.25 లక్షల మంది విచ్చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా విదేశీ అతిథి లేకుండానే రిపబ్లిక్ డే జరగనుంది .


More Telugu News