మద్యం అమ్మకాల సమయాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం: సోము వీర్రాజు
- సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తామన్న హామీని గాలికొదిలేశారు
- ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు
- రాత్రి 8 వరకే మద్యం షాపులను తెరిచి ఉంచాలి
మద్యం అమ్మకాల సమయాన్ని ఏపీ ప్రభుత్వం మరో గంట సేపు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారం సమయంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు మీరు ఇచ్చిన హామీని గాలికి వదిలేసి... కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా మద్యం అమ్మకాలను ఇంకో గంట పాటు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం షాపులను తెరిచి ఉంచాలని... లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.