అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. రషీద్ ఖాన్, గిల్ కూడా నయా ఫ్రాంచైజీకే!

  • ఐపీఎల్ మెగా వేలానికి మరికొన్ని వారాలే సమయం 
  • ముగ్గురికీ కలిపి రూ. 33 కోట్లు వెచ్చిస్తున్న అహ్మదాబాద్
  • 22వ తేదీలోపు రిటెన్షన్ ఆటగాళ్ల పేర్లను ప్రకటించనున్న కొత్త జట్లు
  • ఇప్పటికే కోచింగ్ స్టాఫ్‌ను తీసేసుకున్న అహ్మదాబాద్
ఐపీఎల్ 2022 మెగా వేలానికి మరికొన్ని వారాలే సమయం ఉంది. లీగ్‌లోకి ఈసారి రెండు కొత్త జట్లు వచ్చి చేరడంతో మొత్తం జట్ల సంఖ్య 10కి పెరిగింది. కొత్త జట్లు రెండు ఈ నెల 22వ తేదీలోపు ముగ్గురు రిటెన్షన్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్, రషీద్‌ఖాన్‌లు అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి ఆడనున్నట్టు తెలుస్తోంది.

 సీవీసీ కేపిటల్స్ సొంతం చేసుకున్న ఈ ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోళ్ల  కోసం రూ. 90 కోట్లు వెచ్చించాల్సి ఉండగా ఈ ముగ్గురు ఆటగాళ్లకు కలిపి మొత్తంగా రూ. 33 కోట్లు వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. పాండ్యాకు రూ. 15 కోట్లు, రషీద్‌ఖాన్‌కు రూ. 11 కోట్లు, గిల్‌కు రూ. 7 కోట్లు చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

మరోపక్క, అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఇప్పటికే కోచింగ్ స్టాఫ్‌ను తీసేసుకుంది. టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాను బౌలింగ్ కోచ్‌గా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిరెస్టన్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకోగా, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ విక్రమ్ సోలంకి డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. వీరు ముగ్గురు కలిసి పనిచేయడం ఇది రెండోసారి. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వీరు ముగ్గురు కలిసి పనిచేశారు.

హార్దిక్ పాండ్యా అహ్మదాబాద్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని సమాచారం. అదే జరిగితే ఐపీఎల్‌లో ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి అవుతుంది. గత సీజన్‌లో గాయాలతో తీవ్రంగా ఇబ్బందిపడిన పాండ్యాను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోకుండా వదిలిపెట్టేసింది. అయితే, ముంబై జట్టు గతంలో సాధించిన విజయాల్లో పాండ్యాది కీలక పాత్ర.

ఇక, అహ్మదాబాద్ రిటెన్షన్‌లో రెండో ఆటగాడు రషీద్ ఖాన్. ఐపీఎల్‌లో తొలి నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న రషీద్ ఖాన్.. తొలిసారి కొత్త జట్టుకు ఆడబోతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్ బౌలర్‌గా కీర్తినందుకున్న ఈ లెగ్గీ ఈసారి అహ్మదాబాద్‌కు మారిపోయాడు.

టీమిండియా కుర్రాడు శుభమన్ గిల్‌ ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడాడు. ఈసారి కూడా కోల్‌కతా అతడిని రిటైన్ చేసుకుంటుందని భావించినా అలా జరగలేదు. టీమిండియా, ఐపీఎల్ జట్లకు భవిష్యత్ కెప్టెన్‌ అతడేనంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అహ్మదాబాద్ జట్టు అతడిని ఎంపిక చేసుకుంది. గిల్ కోసం ఏకంగా 7 కోట్లు వెచ్చిస్తోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.


More Telugu News