జట్టులో ఎంతమంది వచ్చినా కోహ్లీ స్థానంలో మార్పు ఉండదు: గంభీర్

  • టెస్టు కెప్టెన్ గా తప్పుకున్నకోహ్లీ
  • కోహ్లీ అంకితభావంలో మార్పు ఉండదన్న గంభీర్ 
  • నాయకత్వం అనేది జన్మ హక్కు కాదని స్పష్టీకరణ
టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. టాస్ కు వెళ్లడం, మైదానంలో ఫీల్డర్లను మోహరించడం వంటి పనులు తప్ప కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత పెద్ద మార్పేమీ ఉండదని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ ఇకపై బ్యాటింగ్ పై శ్రద్ధ చూపించే వెసులుబాటు దొరికిందని అన్నాడు. ఆట పట్ల కోహ్లీకి ఉన్న ఆసక్తి, ఉత్సాహం ఎవరూ శంకించలేనివని పేర్కొన్నాడు. ఎంతమంది వచ్చినా జట్టులో కోహ్లీ స్థానంలో మార్పు ఉండదని, ఎప్పట్లాగే వన్ డౌన్ లో ఆడతాడని గంభీర్ తెలిపాడు.

నాయకత్వం అనేది జన్మహక్కు అని భావించబోనని, కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత ధోనీ వంటి ఆటగాడు కూడా కోహ్లీ కెప్టెన్సీలో ఆడాడని వివరించాడు. ధోనీ ఖాతాలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ ఎలాంటి నామోషీ లేకుండా కోహ్లీ నాయకత్వంలో ఆడాడని వెల్లడించాడు. అంతిమంగా దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఏ ఆటగాడికైనా ప్రాధాన్యతాంశం అని, కోహ్లీ అంకితభావంలో ఎలాంటి మార్పు ఉండబోదని అనుకుంటున్నానని తెలిపాడు.


More Telugu News