ప్రశ్నించిన వారిపై పోలీసులే దౌర్జన్యం చేయడం దారుణం: చంద్రబాబు

  • అరవిందబాబుకు ఫోన్ చేసి పరామర్శించిన చంద్రబాబు
  • అంబులెన్స్‌పైనా దాడిచేయడం వైసీపీ అరాచకానికి నిదర్శనమని ఆగ్రహం
  • వైసీపీ కార్యకర్తలు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
అక్రమ అరెస్టులను ప్రశ్నించిన నేతలపై పోలీసులే దౌర్జన్యానికి దిగడం దారుణమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు నిన్న టీడీపీ నేతలతో మాట్లాడారు. అరవిందబాబుతోనూ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులపై ప్రశ్నించిన అరవిందబాబు, ఇతర నేతలపై సాక్షాత్తూ పోలీసులే దౌర్జన్యానికి దిగడం హేయమన్నారు. పోలీసుల వైఖరికి ఇది నిదర్శనమన్నారు. దాడిలో గాయపడిన నాయకులను తరలించే అంబులెన్స్‌పైనా దాడికి దిగడం వైసీపీ అరాచకానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ల ముందు ఇంత దారుణం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘర్షణకు కారణమైన వైసీపీ కార్యకర్తలతోపాటు పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


More Telugu News