స్కూళ్లకు సెలవులు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే లేదు: మంత్రి ఆదిమూలపు సురేశ్

  • మళ్లీ విజృంభిస్తున్న కరోనా
  • తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు
  • ఏపీలోనూ పొడిగిస్తారంటూ ప్రచారం
  • స్పందించిన మంత్రి ఆదిమూలపు
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అటు తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో ఏపీలోనూ సెలవులు పొడిగిస్తారంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు.

పాఠశాలలకు సెలవులు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే లేదని అన్నారు. ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ చేశామని, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. స్కూళ్లు యథావిధిగా ప్రారంభం అవుతాయని తెలిపారు. భవిష్యత్తులో పరిస్థితి మేరకు నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సెలవుల పొడిగింపును మంత్రి వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆయన పైవిధంగా స్పందించారు.

టీచర్లకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, 15 నుంచి 18 ఏళ్ల లోపు వయసున్న విద్యార్థులకు 90 శాతానికి పైగా వ్యాక్సిన్లు ఇచ్చామని వివరించారు. కరోనా పట్ల ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని, విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. అమెరికాలో లక్షలాది కేసులు వస్తున్నప్పటికీ విద్యాసంస్థలను మూసివేయలేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ సందర్భంగా ఉదహరించారు.

ఏపీలో ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వడం తెలిసిందే. రేపటి నుంచి విద్యాసంస్థలు షురూ కానున్నాయి. కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం సమీక్ష సమావేశం జరపనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశం అనంతరం సెలవులపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, కరోనా కేసులు తీవ్రస్థాయిలో వస్తుండడంతో ఇప్పటికే అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలు మూసివేశాయి. ఏపీలోనూ రోజువారీ కేసుల సంఖ్య 4 వేల పైచిలుకు నమోదవుతోంది.


More Telugu News