ఒక్క నెలలోనే రూ.35,000 కోట్ల బంగారం దిగుమతి

  • 2021 డిసెంబర్ లో నమోదు
  • 2021 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రెట్టింపు
  • రూ. 2.81 లక్షల కోట్ల దిగుమతి
  • పెరిగిన వాణిజ్యలోటు
  • ధరలు తక్కువగా ఉండడంతో పెరిగిన డిమాండ్
బంగారానికి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. పెట్టుబడులు, ఆభరణాల దృష్ట్యా బంగారానికి డిమాండ్ తగ్గడం లేదని గణాంకాలను చూస్తే తెలుస్తోంది. 2021 డిసెంబర్ లో దేశంలోకి 4.8 బిలియన్ డాలర్ల విలువైన (సుమారు రూ.35,520 కోట్లు) బంగారం దిగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. 2020 డిసెంబర్ లో 4.5 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోలిస్తే స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది.

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) 2021 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఏకంగా 38 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు (రూ.2,81,200కోట్లు) నమోదైనట్టు వాణిజ్య శాఖ తెలిపింది. కానీ, 2020 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 16.78 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోల్చి చూస్తే రెట్టింపునకు పైగా పెరిగాయి. 2020లో కరోనా మొదటి విడతలో లాక్ డౌన్ ల ప్రభావం బంగారం దిగుమతులు తక్కువగా ఉండడానికి కారణంగా చెప్పుకోవాలి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల కాలంలో పసిడి దిగుమతులు పెరిగినందున వాణిజ్య లోటు 142 బిలియన్ డాలర్లకు విస్తరించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో వాణిజ్య లోటు 61 బిలియన్ డాలర్లుగానే ఉంది.  పెళ్లిళ్లు ఎక్కువగా జరగడం, ఆంక్షలు తగ్గిపోవడం, బంగారం ధరలు తక్కువ స్థాయిలో ఉండడం ఇవన్నీ దిగుమతులు పెరిగేందుకు దారితీసిన అంశాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.


More Telugu News