ఎన్నికలను ఆరు రోజులపాటు వాయిదా వేయండి: ఈసీకి లేఖ రాసిన పంజాబ్ సీఎం

  • వచ్చే నెల 14న ఒకే విడతలో పంజాబ్ ఎన్నికలు
  • 16న శ్రీ గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని బెనారస్ సందర్శించనున్న లక్షలాదిమంది
  • వారంతా ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతారన్న సీఎం
ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా, వాటిని మరో ఆరు రోజులపాటు వాయిదా వేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఫిబ్రవరి 16న శ్రీ గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు దాదాపు 20 లక్షల మంది ఫిబ్రవరి 10-16 మధ్య ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌ను  సందర్శిస్తారని, కాబట్టి 14న ఎన్నికలు జరిగితే వారు ఓటు హక్కును వినియోగించు కోలేరని పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికలను ఆరు రోజులపాటు వాయిదా వేయాలని కోరారు.

కాగా, పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీ నిన్న 86 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ చామ్‌కూర్ సాహిబ్ నుంచి పోటీ చేస్తుండగా, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్  సిద్ధూ అమృత్‌సర్ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఇక్కడ ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఫలితాలు విడుదల కానున్నాయి.


More Telugu News