తన ఫాంహౌస్ సమీపంలో ఉండే వ్యక్తిపై కోర్టులో దావా వేసిన సల్మాన్ ఖాన్

  • కేతన్ కక్కడ్ అనే వ్యక్తిపై కోర్టులో కేసు 
  • తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని ఆరోపణ  
  • మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు సల్మాన్ విజ్ఞప్తి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ వ్యక్తిపై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పన్వేల్ లోని తన ఫాంహౌస్ సమీపంలో ఉండే కేతన్ కక్కడ్ అనే వ్యక్తిపై సల్మాన్ ఖాన్ పరువునష్టం దావా వేశారు. కేతన్ కక్కడ్ ముంబయిలోని మలాడ్ ప్రాంతానికి చెందినవాడు. అతడికి పన్వేల్ లో సల్మాన్ ఫాంహౌస్ కు సమీపంలో కొంత భూమి ఉంది. అయితే, ఇటీవల తన గురించి కేతన్ కక్కడ్ యూట్యూబ్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, తనను కించపరిచేలా మాట్లాడాడని సల్మాన్ ఆరోపించారు.

ఈ క్రమంలో కక్కడ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను, యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాలను కూడా సల్మాన్ ఈ కేసులో చేర్చారు. తనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ప్రసారం కాకుండా స్టే ఇవ్వాలని, ఆయా మాధ్యమాల్లో తనను అవమానపరిచేలా ఉన్న కంటెంట్ ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని సల్మాన్ ఖాన్ న్యాయస్థానాన్ని కోరారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. సల్మాన్ ఆరోపణలపై బదులిచ్చేందుకు తమకు వ్యవధి కావాలంటూ కేతన్ కక్కడ్ తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తికి కోర్టు సానుకూలంగా స్పందించింది.


More Telugu News