మాస్కుల గొప్పతనం మరోటి వెలుగులోకి.. వైరస్ ప్రయాణించే దూరాన్ని సగానికి సగం తగ్గిస్తున్న మాస్కులు!

  • కరోనా నియంత్రణ చర్యల్లో ఫేస్‌మాస్క్‌ది కీలక పాత్ర
  •  సర్జికల్ మాస్కుతో మరింత తగ్గుతున్న దూరం  
  • సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
కరోనా నియంత్రణ చర్యల్లో ఫేస్‌మాస్కులది కీలక పాత్ర. వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా అడ్డుకోవడంలో మాస్క్‌లు అద్భుతంగా పనిచేస్తున్నట్టు ఇప్పటికే తేలింది. మాస్కులకు సంబంధించి తాజా అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. వ్యక్తులు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా కరోనా వైరస్ వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు గాలిలో ప్రయాణించగల దూరాన్ని ఈ మాస్కులు సగానికి సగం తగ్గిస్తున్నట్టు తేలింది.

అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. వస్త్రంతో తయారుచేసిన మాస్క్, మూడు పొరల సర్జికల్ మాస్క్, అసలు మాస్కు ధరించని సమయంలో వ్యక్తులు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా వెలువడే తుంపర్లు గాలిలో ఎంత దూరం ప్రయాణిస్తాయన్న విషయాన్ని పరిశీలించారు.

మాస్కు ధరించకుండా మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు వారి నుంచి వెలువడే తుంపర్లు గాలిలో 4 అడుగుల దూరం వరకు ప్రయాణిస్తుండగా, వస్త్రంతో తయారుచేసిన మాస్కు ధరించినప్పుడు ఇవి ప్రయాణించే దూరం రెండు అడుగులకు తగ్గుతోంది. సర్జికల్ మాస్కు పెట్టుకుంటే ఈ దూరం మరింత తగ్గుతున్నట్టు అధ్యయనంలో గుర్తించారు.


More Telugu News