బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి.. కోస్తాకు నేడు భారీ వర్ష సూచన

  • కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం
  • శనివారం వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
  • నిన్న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలుచోట్ల నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి విదర్భ, చత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాతోపాటు రాయలసీమలో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

అలాగే, కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపటి వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఇక, బంగాళాఖాతంలో తూర్పు గాలులు బలంగా వీస్తుండడంతో నిన్న కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శృంగవరపు కోటలో 9, పార్వతీపురంలో 8, పొన్నూరు, మంగళగిరి, గొలుగొండ్లలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖపట్టణంలోనూ గత రాత్రి భారీ వర్షం కురిసింది.


More Telugu News