టీడీపీ నేత చంద్ర‌య్య దారుణ హ‌త్య ఫొటోలు పోస్ట్ చేసి.. మండిప‌డ్డ టీడీపీ నేత‌లు

  • ఏపీలో వైసీపీ అరాచ‌క పాల‌న: చంద్ర‌బాబు
  • నిందితుల‌ను అరెస్టు చేయాలి:  లోకేశ్
  • నడిరోడ్డుపై గొంతు కోశారు: దేవినేని
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య (36) దారుణ హత్యకు గురైన విష‌యం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. వెంట‌నే నిందితుల‌ను అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఏపీలో వైసీపీ అరాచ‌క పాల‌న కొన‌సాగుతోంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. గ‌తంలోనూ త‌న పార్టీ నేత‌ల‌పై దాడులు జ‌రిగాయ‌ని గుర్తు చేశారు. సీఎం జ‌గ‌న్ తీరును ప్ర‌శ్నిస్తోన్న త‌మ పార్టీ నేత‌ల‌పై దాడులు చేస్తూ వారిని భ‌య‌పెట్టాల‌నుకుంటున్నార‌ని ఆయ‌న మండిపడ్డారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌లువురి హ‌త్య‌లు జ‌రిగాయ‌ని తెలిపారు. గ‌తంలో త‌మ పార్టీ నేత‌ల‌పై దాడులు జ‌రిగినప్పుడే వైసీపీ స‌ర్కారు త‌గిన చ‌ర్య‌లు తీసుకుని ఉంటే ఇప్పుడు మ‌రో హ‌త్య జ‌రిగేది కాద‌న్నారు.

'హత్యా రాజకీయాల వారసుడు వైఎస్ జ‌గ‌న్.. ఆయ‌న సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రశ్నించే వారిపై  దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారింది. పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు' అని లోకేశ్ విమ‌ర్శించారు.

'గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, గుండ్లపాడు గ్రామంలో వైసీపీ ఫ్యాక్షన్ మూకలు టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.  ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.

'అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలి. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది' అని తెలిపారు. ఈ సంద‌ర్భంగా హ‌త్య‌కు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేశారు.

'మాచర్లలో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా.. పట్టపగలే నడిరోడ్డుపై గొంతు కోయడం అధికారపార్టీ నేతల దుర్మార్గాలకు పరాకాష్ఠ. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, పోరాడుతున్న టీడీపీ నేతలను అంతమొందించడం మీ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనం కాదా?' అని దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు.


More Telugu News