యూపీలో బీజేపీని వీడి, ఎస్‌పీలో చేరిన మాజీమంత్రికి 2014 నాటి కేసులో అరెస్ట్ వారెంట్

  • హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యల కేసు
  • 2016 లోనే అరెస్ట్ వారెంట్.. అప్పట్లో హైకోర్టు స్టే
  •  బీజేపీని వీడిన మరో మంత్రి దారాసింగ్ 
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మంగళవారం మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్యకు ఒక్క రోజు కూడా కాకముందే షాక్ తగిలింది.

హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ 2014లో నమోదైన కేసుకు సంబంధించి తాజాగా స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నిజానికి ఈ కేసులో 2016లోనే ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే, అప్పట్లో అలహాబాద్ హైకోర్టు దానిపై స్టే విధించింది.  

మరోవైపు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ చెప్పినట్టుగా బీజేపీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. యోగి కేబినెట్‌లోని మరో మంత్రి దారాసింగ్ చౌహాన్ నిన్న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పటి వరకు బీజేపీని వీడిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన దారాసింగ్ 2017 ఎన్నికలకు ముందు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) నుంచి బీజేపీలో చేరారు. అంతకుముందు ఆయన బీఎస్‌పీ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు.


More Telugu News