హీరో ఎవ‌రో.. కీచ‌కుడెవ‌రో తేల్చుదాం: నోటీసుల‌పై స్పందించిన ర‌ఘురామకృష్ణ‌రాజు

  • కడుపు మండిన ప్రజల ప్రతినిధిగా ప్రశ్నిస్తున్నా
  • అలా ప్రశ్నిస్తే కూడా రాజద్రోహమా?
  • పండుగ రోజు వ‌స్తున్నానని తెలిసి నోటీసులు
  • జ‌గ‌న్ రెండేళ్లుగా కోర్టుకు హాజరు కాలేదు.. నేను విచార‌ణ‌కు హాజ‌ర‌వుతా
  • రాజీనామా చేస్తా.. అంద‌రూ మ‌ద్ద‌తు తెల‌పాలి
హైద‌రాబాద్‌లోని గచ్చిబౌలిలోని వైసీపీ అసంతృప్త‌ నేత‌, ఎంపీ రఘురామకృష్ణ‌రాజు ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చి వెళ్లిన విష‌యం తెలిసిందే. దీనిపై మీడియా స‌మావేశం నిర్వ‌హించిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఏపీ సీఎం జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు. రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే అది రాజద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కడుపు మండిన ప్రజల ప్రతినిధిగా తాను ప్రశ్నిస్తున్నానని, అలా ప్రశ్నిస్తే కూడా రాజద్రోహమా? అని ఆయ‌న అడిగారు.

త‌న‌ను హింసించిన వీడియోలు చూసి ఎవ‌రు ఆనంద‌ప‌డ్డారో త‌న‌కు తెలుస‌ని, త‌న‌ను ఎంత‌గా హింసించారో ప్ర‌జ‌ల‌కు తెలియాల‌ని ఆయ‌న అన్నారు. ఏపీలో రావ‌ణ రాజ్యంపై ప్ర‌జ‌లు విసుగెత్తిపోయార‌ని ర‌ఘురామకృష్ణ‌రాజు వ్యాఖ్యానించారు. హీరో ఎవ‌రో.. కీచ‌కుడెవ‌రో తేల్చుదాం అని వ్యాఖ్యానించారు. పార్టీల‌కు అతీతంగా అంద‌రం క‌లిసి రావ‌ణ‌రాజ్యాన్ని అంతం చేద్దాం అని ర‌ఘురామకృష్ణ‌రాజు పిలుపునిచ్చారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. అమ్మఒడి పథకంతో పాటు, ఇసుక‌లో వేల కోట్ల రూపాయ‌లు దోచుకుంటున్నార‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలో కొన‌సాగుతోన్న ఆట‌విక పాల‌న‌ను త‌ల‌పిస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రెండేళ్ల‌లో సీఎం జ‌గ‌న్ ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లలేద‌ని ఆయ‌న ఆరోపించారు.

'సీఎం మాత్రం కోర్టుకు వెళ్లరు.. నేను మాత్రం పండుగ రోజుల్లోనూ విచార‌ణ‌కు రావాలా?' అని ఆయ‌న నిల‌దీశారు. అయిన‌ప్ప‌టికీ చ‌ట్టాన్ని గౌర‌విస్తూ తాను విచార‌ణకు హాజ‌ర‌వుతాన‌ని స్ప‌ష్టం చేశారు. సునీల్ కుమార్ నేతృత్వంలోని ఒక బృందం త‌మ ఇంటికి వ‌చ్చింద‌ని, త‌న‌పై ఉన్న కేసులో మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్టేందుకే నోటీసులు ఇచ్చామ‌ని చెప్పింద‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వివ‌రించారు.

హిందువుల‌కు సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైన పండుగ అని, ఇన్నాళ్లు త‌న‌కు నోటీసులు ఇవ్వ‌కుండా, పండుగ ముందే ఇవ్వ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను న‌ర‌సాపురం నియోజ‌క వ‌ర్గానికి వ‌స్తున్నాన‌ని క‌లెక్ట‌ర్, ఎస్పీకి ఇప్ప‌టికే తెలిపాన‌ని అన్నారు. పండుగ‌కు తాను వ‌స్తున్నాన‌ని తెలిసే త‌న‌కు నోటీసులు ఇచ్చారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. సీఐడీ సునీల్‌, సీఎం జ‌గ‌న్‌కు పండుగ‌రోజే నోటీసులు ఇవ్వాల‌ని గుర్తుకు వ‌చ్చిందా? అని ఆయ‌న అన్నారు.

తాను చ‌ట్టాల‌ను, న్యాయ‌స్థానాల‌ను న‌మ్మే వ్య‌క్తిన‌ని చెప్పుకొచ్చారు. క‌రోనా ప్రోటోకాల్స్‌కు అనుగుణంగానే తాను విచార‌ణ‌కు హాజ‌రవుతాన‌ని చెప్పారు. గ‌తంలో త‌న‌ను విచారిస్తోన్న స‌మయంలో కెమెరాలు తొల‌గించింది ఎవ‌రని, త‌న‌ను తీవ్రంగా హింసించింది ఎవ‌రో త‌న‌కు తెలియాల‌ని ఆయ‌న అన్నారు.

ఎస్సీల‌పైనా ఎస్సీ కేసులు పెట్ట‌డం చూస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌లకు భ‌విష్య‌త్తు కావాలంటే తాను ఉప ఎన్నిక‌లో గెల‌వాల‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రూ ఒక్క‌ట‌వ్వాల‌ని అన్నారు. కేవ‌లం త‌న గెలుపు మాత్రమే ముఖ్యం కాద‌ని భారీ మెజార్టీ రావాల‌ని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తిని తెలియ‌ప‌ర్చ‌డానికి చేస్తోన్న‌ తన ప్ర‌య‌త్నానికి అంద‌రి మ‌ద్ద‌తూ వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు.


More Telugu News