కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్

  • స్వల్ప లక్షణాలున్నాయన్న మంత్రి
  • ఇంట్లోనే ఐసోలేట్ అయినట్టు వెల్లడి
  • కరోనా బారిన పడుతున్న నేతలు, ప్రముఖులు
కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్టు నిన్న రాత్రి ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి.

‘‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలున్నాయి. అన్ని ప్రొటోకాల్స్ ను పాటిస్తూ నాకు నేనుగా ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాను. హోం క్వారంటైన్ లో ఉన్నాను. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారు ఐసోలేట్ అయ్యి టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ గడ్కరీ ట్వీట్ చేశారు.  

ఇటీవలి కాలంలో కరోనా బారిన పడుతున్న మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల జాబితా పెరిగిపోతోంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో పొలిటికల్ లీడర్లపై ఇంత ప్రభావం లేకపోయినా.. ఇప్పుడు థర్డ్ వేవ్ లో అందరూ దాని బారిన పడుతున్నారు. కాగా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి వారికి కరోనా సోకిన కొన్ని రోజులకే గడ్కరీ కూడా కరోనా బారిన పడ్డారు.

ఇటు నిన్న ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కూడా కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు చికిత్సనందిస్తూ వైద్యులూ దాని బారిన పడుతున్నారు. మూడోవేవ్ లో హెల్త్ స్టాఫ్ పైనా కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.


More Telugu News