భారత్ కంటే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితే మెరుగు: ఇమ్రాన్ ఖాన్ గొప్పలు

  • ఎన్నో దేశాల కంటే మెరుగ్గా ఉన్నాం
  • చమురు ధరలు చాలా తక్కువ
  • ఎన్నో సంక్షోభాల నుంచి దేశాన్ని రక్షించాం
  • ఒక కార్యక్రమంలో భాగంగా పాక్ ప్రధాని వ్యాఖ్యలు
ఒకవైపు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సాయం కోసం ప్రాధేయపడుతూ.. మరోవైపు భారత్ కంటే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందన్నారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. బిలియన్ డాలర్ల (రూ.7,500 కోట్లు) ఆర్థిక సాయం కోసం ఐఎంఎఫ్ పెట్టిన ఎన్నో షరతులకు అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. సంబంధిత బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందే సవాలును ఎదుర్కొంటోంది.

స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్థాన్ కు స్వయంప్రతిపత్తి నివ్వాలని ఐఎంఎఫ్ పెట్టిన షరతుల్లో ఒకటి. దీనిపై ఇస్లామాబాద్ లో ఒక కార్యక్రమం సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ‘‘పాకిస్థాన్ ఎన్నో దేశాల కంటే ముఖ్యంగా భారత్ తో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉంది. ఎన్నో దేశాలతో పోల్చి చూసినా కానీ చౌక దేశాల్లో (నివాస పరంగా) ఒకటి. ప్రతిపక్షం అసమర్థ ప్రభుత్వం అంటూ విమర్శిస్తోంది. కానీ మా ప్రభుత్వం అన్ని సంక్షోభాల నుంచి దేశాన్ని కాపాడింది’’ అని చెప్పారు.

చాలా దేశాల కంటే పాకిస్థాన్ లో చమురు ధరలు తక్కువగా ఉన్నట్టు ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ప్రతిపక్ష నేత పీఎంఎల్ ఎన్ అధ్యక్షుడు షెబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని నేషనల్ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తారు. ఒక వైపు అణుశక్తి దేశంగా ఉంటూ, మరోవైపు చిప్ప పట్టుకుని అడుక్కోవడం ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశ ఆర్థిక పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం దివాలా తీయించిందని విమర్శించారు.


More Telugu News