13 మంది యూపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్‌పీలో చేరుతున్నారు: శరద్ పవార్

  • యూపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
  • యూపీలో ఎస్‌పీ, ఇతర చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తాం
  • గోవాలో టీఎంసీ, కాంగ్రెస్‌తో కలిసి బరిలోకి దిగుతాం
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు యూపీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నేత, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలో చేరిన కాసేపటికే మరో ముగ్గురు కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. దీంతో అప్రమత్తమైన బీజేపీ నష్టనివారణ చర్యలు ప్రారంభించే లోపే.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ బాంబు పేల్చారు.

ముంబైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్‌పీ, ఇతర చిన్న పార్టీలతో కలిసి యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించారు. యూపీలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్న ఆయన 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరబోతున్నారని అన్నారు.

ఈ ఎన్నికల్లో మనం తప్పకుండా మార్పును చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా యూపీలో మతపరంగా ప్రజలను ఏకీకృతం చేసే పనులు ఊపందుకున్నాయని ఆరోపించిన శరద్ పవార్.. ఈ ఎన్నికల్లో యూపీ ప్రజలు అలాంటి వాటికి గట్టిగా బదులిస్తారని చెప్పుకొచ్చారు. గోవా ఎన్నికల్లో కాంగ్రెస్, టీఎంసీతో కలిసి పోటీ చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు.

ఇక, కార్మిక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి, సమాజ్‌వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం దళితులు, రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను పట్టించుకోవడం మానేసిందని ఆరోపించారు. తన రాజీనామాకు అదే కారణమన్నారు. కాగా, యూపీలో మొత్తం ఏడు విడతలుగా ఎన్నికలు జరగనుండగా, వచ్చే నెల 7న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.


More Telugu News