ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఎదురుదెబ్బ... రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరిన మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు

  • త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
  • ఇటీవలే షెడ్యూల్ ప్రకటన
  • మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎస్పీ మౌర్య
  • సాదరంగా ఆహ్వానం పలికిన అఖిలేశ్ యాదవ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ కూడా వచ్చిన నేపథ్యంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, ఎమ్మెల్యేలు రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్ పదవులకు రాజీనామా చేశారు. మంత్రి ఎస్పీ మౌర్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కు పంపించారు. యోగి ఆదిత్యనాథ్ సర్కారు దళితులు, ఓబీసీలు, రైతులు, యువత పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మౌర్య ఆరోపించారు.

మౌర్య రాజీనామా ప్రకటన చేసిన కొద్దిసేపటికే సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సోషల్ మీడియాలో స్పందించారు. మౌర్యతో కలిసున్న ఫొటో పంచుకున్నారు. సామాజికనేతకు సాదరస్వాగతం అంటూ పార్టీలో చేరికను ప్రకటించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం సమాజ్ వాదీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది.

మౌర్యకు ఓబీసీ నేతగా యూపీలో ఎంతో గుర్తింపు ఉంది. పూర్వాంచల్ ప్రాంతంలోని పద్రౌనా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మౌర్య ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గారు. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ లో కార్మిక, ఉపాధి సమన్వయ శాఖ మంత్రిగా వ్యవహరించారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏకంగా మంత్రి రాజీనామా చేయడం, ప్రధాన ప్రత్యర్థి పక్షం సమాజ్ వాదీ పార్టీలో చేరడం బీజేపీకి తీవ్ర నష్టం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మౌర్య కుమార్తె సంఘమిత్ర బీజేపీ ఎంపీ. ఆమె బదౌన్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


More Telugu News