సినిమా టికెట్ల ధరలు, ఎన్ని షోలు వేసుకోవాలనేది చిత్ర పరిశ్రమకే వదిలేయండి: ఏపీ ప్రభుత్వానికి సూచించిన వర్మ

  • ఇటీవల మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ
  • తాజాగా వరుస ట్వీట్లు
  • ప్రభుత్వం ఇతర అంశాలు చూసుకోవాలని సూచన
  • పరస్పర విమర్శలు వద్దని ఇరువర్గాలకు హితవు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా టికెట్ల ధరలపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో సమావేశం కావడం తెలిసిందే. ఈ క్రమంలో వర్మ సినీ రంగ సమస్యలపై ట్విట్టర్ లో స్పందించారు. సినిమా టికెట్ల ధరలు, ఎన్ని షోలు వేసుకోవాలనే విషయాలను చిత్రపరిశ్రమకే వదిలేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

ఇకపై భద్రతా ప్రమాణాల అమలు, లావాదేవీల్లో పారదర్శకత, పన్నుల వసూలుపై ప్రభుత్వం తన శక్తిని కేంద్రీకరించాలని వివరించారు. పరస్పరం బురదచల్లుకునే విధానానికి స్వస్తి పలికి ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని అటు మంత్రి పేర్ని నాని బృందానికి, ఇటు సినీ రంగ సహచరులకు విజ్ఞప్తి చేస్తున్నానని వర్మ పేర్కొన్నారు.

అయితే, సినిమా టికెట్ల అంశం కాస్తా అనేక సమస్యలను తెరపైకి తీసుకువచ్చిందన్న విషయం  మంత్రి పేర్ని నానితో సమావేశం తర్వాత తనకు అర్థమైందని వర్మ వెల్లడించారు. 1955 సినిమాటోగ్రఫీ చట్టాన్ని 70 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా తవ్వితీసి, ఏపీ సర్కారు అమలు చేస్తున్న తీరు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని కోర్టులో సవాలు చేయాల్సిన అవసరం కూడా ఉందని వర్మ పేర్కొన్నారు. 


More Telugu News