'జగనన్న స్మార్ట్ టౌన్ షిప్పులు' పథకం ప్రారంభం.. తక్కువ ధరకే ప్లాట్లు అందిస్తామన్న సీఎం జగన్!

  • తక్కువ రేటుకే మధ్య తరగతి ప్రజలకు ప్లాట్ల విక్రయం  
  • ప్రభుత్వమే లేఔట్లు వేసి ఇస్తుందన్న సీఎం
  • 150 గజాలు, 200 గజాలు, 240 గజాల ప్లాట్లు అందిస్తామన్న జగన్
'జగనన్న స్మార్ట్ టౌన్ షిప్పులు' పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే మధ్య తరగతి ప్రజలకు ప్లాట్లను అందిస్తామని చెప్పారు. లాభాపేక్ష లేకుండా మధ్య తరగతి ప్రజలకు క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్లు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వమే లేఔట్లు వేసి ప్లాట్లను ఇస్తుందని చెప్పారు. ఎంఐజీ (మిడిల్ ఇన్ కమ్ గ్రూప్) లేఔట్లలో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అందించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

మూడు కేటగిరీల్లో ప్లాట్లను అందిస్తామని... ఎంఐజీ-1 కింద 150 గజాలు, ఎంఐజీ-2 కింద 200 గజాలు, ఎంఐజీ-3 కింద 240 గజాల స్థలాన్ని అందిస్తామని జగన్ చెప్పారు. తొలి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, గుంటూరు జిల్లా నవులూరులో లేఔట్లు వేస్తున్నట్టు తెలిపారు. ఈరోజు నుంచే ప్లాట్లను ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా స్మార్ట్ టౌన్ షిప్స్ కు సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం ప్రారంభించారు.

ప్లాట్ల కొనుగోలుకు సంబంధించిన డబ్బును నాలుగు విడతల్లో కట్టే అవకాశం ఉంటుందని జగన్ తెలిపారు. ఒకే విడతలో డబ్బు కట్టే వారికి 5 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి ఈ పథకాన్ని విస్తరిస్తామని తెలిపారు. ప్రతి పేద వాడికి ఇల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని... ఇప్పటి వరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని వెల్లడించారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.


More Telugu News