మనిషికి పంది గుండె.. విజయవంతంగా అమర్చిన అమెరికా వైద్యులు

  • కోలుకుంటున్న రోగి
  • సాధారణంగానే పల్స్ రేట్
  • భవిష్యత్తు చికిత్సలకు ఇదొక ఆప్షన్
  • వైద్యుల ఆశాభావం
ప్రపంచంలో మొట్టమొదటి సారి గుండె మార్పిడి చికిత్సలో అమెరికా వైద్యులు కొత్త చరిత్ర సృష్టించారు. పంది గుండెను మనిషికి విజయవంతంగా అమర్చారు. 57 ఏళ్ల మేరీల్యాండ్ నివాసి డేవిడ్ బెన్నెట్ ప్రాణాంతక అరిథ్మియాతో బాధపడుతుండడం, వేరొక దాత నుంచి గుండె మార్పిడికి నిబంధనలు అంగీకరించకపోవడం ఈ కొత్త ఆవిష్కరణకు దారితీశాయి.

యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు  గత శుక్రవారం ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు. రోగి చక్కగా కోలుకుంటున్నట్టు వైద్యులు ప్రకటించారు. చికిత్సకు ముందు అతడ్ని హార్ట్-లంగ్ బైపాస్ మెషిన్ పై ఉంచారు. ఇప్పటికీ ఆ మెషిన్ ను తొలగించలేదు. రికవరీ బాగుండడంతో నేడు ఆ మెషిన్ ను తొలగిస్తారు.

ఈ చికిత్సకు జన్యుపరంగా మార్పిడి చేసిన పంది నుంచి గుండెను తీసుకున్నారు. ఇది సాధారణ పనితీరు చూపిస్తూ పల్స్ ను జనరేట్ చేస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. ఇప్పటి వరకు రోగి శరీరం గుండెను తిరస్కరిస్తున్న సంకేతాలు ఏవీ కనిపించలేదని చెప్పారు.

‘‘చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. ప్రపంచంలో నిర్వహించిన ఈ తొలి సర్జరీ భవిష్యత్తులో రోగులకు ఎంతో కీలకమైన ఆప్షన్ అవుతుందన్న ఆశాభావం ఉంది’’ అని ఈ సర్జరీలో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ బార్ట్ లే గ్రిఫ్ఫిత్ తెలిపారు. గతంలో పంది హార్ట్ వాల్వ్, చర్మాన్ని చికిత్సల కోసం వినియోగించారు. పూర్తిస్థాయి గుండె వినియోగం ఇదే మొదటిసారి.


More Telugu News