డెల్టాలో 20-23 శాతం.. ఒమిక్రాన్ లో 5-10 శాతం.. ఆసుపత్రుల్లో కేసుల తీరు!

  • కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవచ్చు
  • ఆసుపత్రులలో సదుపాయాలను పెంచుకోవాలి
  • ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థుల సేవలు వాడుకోవాలి
  • రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచన
కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య వేగంగా మారిపోవచ్చని, అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది. హోమ్ ఐసోలేషన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారిపై పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో చికిత్సా సదుపాయాలను పెంచుకోవాలని.. అవసరమైతే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులు, జూనియర్ రెసిడెంట్లు, నర్సింగ్ విద్యార్థులు, రిటైర్డ్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు.

‘‘కరోనా రెండో విడతలో (డెల్టా వేరియంట్) మొత్తం పాజిటివ్ కేసుల్లో 20-23 శాతం వరకు ఆసుపత్రులలో చేరిన పరిస్థితి చూశాం. ఒమిక్రాన్ రకంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారు 5-10 శాతంలోపే ఉన్నారు. పరిస్థితి మారుతోంది. కనుక ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగొచ్చు’’ అని భూషణ్ వివరించారు.

ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్ సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. ప్రస్తుతం కేసుల పెరుగుదల ఒమిక్రాన్ వల్లేనని, డెల్టా కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోందని భూషణ్ చెప్పారు.


More Telugu News