కరోనా వైరస్ పై పోరాటంలో ‘ప్రొటీన్’ కీలకం!

  • రోగనిరోధక వ్యవస్థకు ఇది కీలకం
  • కిలో శరీర బరువుకు రోజులో కనీసం 0.8 గ్రాముల ప్రొటీన్ తీసుకోవచ్చు  
  • చికెన్, చేపలు, పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది
  • విడిగా పౌడర్ రూపంలోనూ తీసుకోవచ్చు
కరోనా అనే కాదు.. మన శరీరంలోకి చొరబడిన ఏ వైరస్ పైనైనా రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పోరాడి మనల్ని రక్షించాలంటే.. అందుకు ఆరోగ్యకరమైన ఆహారం, చక్కని జీవనశైలి ఎంతగానో అవసరం. ఎన్నో అధ్యయనాలు సైతం దీనిని తెలియజేస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా ఆహారంలో ప్రొటీన్ (మాంసకృత్తులు)కు ప్రాధాన్యం ఇవ్వాలి. కరోనా రోగులకు ప్రొటీన్ ఆహారాన్ని ఇవ్వాలని వైద్యులు సూచించడం వినే ఉంటారు. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. అదే వైరస్ పై పోరాటానికి కావాల్సినంత బలాన్నిస్తుంది. మన శరీరంలో ప్రొటీన్ అన్నది ముఖ్యమైన పోషకం. కొత్త కణాల ఆవిర్భావానికి దీని అవసరం ఎంతో ఉంటుంది.

ప్రొటీన్ లోపం ఉంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల వైరస్ దాడికి శరీర రక్షణ వ్యవస్థ తలవొంచాల్సి వస్తుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆహార పరంగా నియమాలు పాటిస్తుంటారు. అటువంటి వారిలోనూ పోషక లేమి ఏర్పడవచ్చు. అందుకనే పోషకాహారంపై శ్రద్ధ తీసుకోవాలి. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి, రాని వారికి కూడా ప్రొటీన్ తీసుకోవాలని వైద్యులు సూచించడం ఇందుకే.  

కిలో శరీర బరువుకు గాను రోజుకు 0.8 గ్రాముల ప్రొటీన్ ను తీసుకోవచ్చు. వయసు, అనారోగ్యం తదితర అంశాలు కూడా డోసేజీని నిర్ణయిస్తాయి. కరోనా వచ్చిన వారికి మరింత అధికంగా ప్రొటీన్ ను వైద్యులు సూచించొచ్చు.

చికెన్, చేపలు, డైరీ ఉత్పత్తులు, బీన్స్, లెంటిల్స్, నట్స్, తృణ ధాన్యాల్లో ప్రొటీన్ లభిస్తుంది. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. శరీరానికి సరిపడా ఇవ్వడం కోసం ప్రొటీన్ పౌడర్ ను కూడా తీసుకోవాల్సి రావచ్చు. ముఖ్యంగా మహమ్మారి బెడద పోయే వరకైనా దినచర్యలో పోషకాహారాన్ని భాగం చేసుకుంటే రక్షణ పెరుగుతుంది.


More Telugu News