'విక్రమ్ వేద' నుంచి హృతిక్ స్పెషల్ పోస్టర్!

  • తమిళంలో భారీ హిట్ కొట్టిన సినిమా
  • షూటింగు దశలో హిందీ రీమేక్
  • 'వేద' పాత్రలో హృతిక్ రోషన్
  • సెప్టెంబర్ 30వ తేదీన విడుదల
తమిళంలో 2017లో వచ్చిన భారీ హిట్ చిత్రాలలో ఒకటిగా .. భారీ మల్టీ స్టారర్ చిత్రాలలో ఒకటిగా 'విక్రమ్ వేద' కనిపిస్తుంది. విజయ్ సేతుపతి - మాధవన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. విక్రమ్ - వేద అనే ఈ రెండు పాత్రలు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తూ, నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడుతుంటాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది.

తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించిన పుష్కర్ - గాయత్రి, హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. హిందీలో ఈ సినిమాలో హృతిక్ రోషన్ - సైఫ్ అలీ ఖాన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. టి సిరీస్ - రిలయన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, కరోనా కారణంగా సెట్స్ పైకి ఆలస్యంగా వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది.

ఈ రోజున హృతిక్ రోషన్ బర్త్ డే కావడంతో, ఈ సినిమా నుంచి ఆయన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన 'వేద' పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అప్పటికి ఈ సినిమా థియేటర్లకు వచ్చేస్తుంది..


More Telugu News