ఆత్మకూరులో ఐదు రోజులపాటు 144 సెక్షన్.. 500 మంది ప్రత్యేక పోలీసు బలగాలతో గస్తీ

  • ప్రార్థనా మందిరం నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం
  • బీజేపీ నేత శ్రీకాంత్‌రెడ్డిపై దాడికి యత్నం
  • పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
  • మత విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరిక
ఇరువర్గాల ఘర్షణలతో అట్టుడికిన కర్నూలు జిల్లా ఆత్మకూరులో పోలీసులు ఐదు రోజులపాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఓ ప్రార్థనా మందిరం నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య శనివారం తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా బీజేపీ నేత శ్రీకాంత్‌రెడ్డిపై ఓ వర్గం వారు దాడికి యత్నించగా, ఆయన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న ఆందోళనకారులు శ్రీకాంత్‌రెడ్డి కారును ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. పోలీస్  స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కంటికి గాయం కాగా, మరో ఇద్దరు ఎస్ఐలు గాయపడ్డారు. ఈ ఘటనపై ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. జరిగిన ఘటనకు సంబంధించి ఇరు వర్గాలకు చెందిన 30 మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. పట్టణంలో ఐదు రోజులపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని  పేర్కొన్నారు. మొత్తం 500 మందితో కూడిన అదనపు పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మతవిద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


More Telugu News